బాబుతో మాజీ జేడీ భేటీ...ఆ ఎంపీ సీటుకు పోటీ?!

Update: 2018-10-18 04:02 GMT
తెలుగు రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క పరిణామం చోటుచేసుకోవ‌డం దాదాపుగా ఖరారైన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ, త‌న ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నట్లు ప్ర‌క‌టించిన మాజీ ఐపీఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. త‌న రాజ‌కీయ అరంగేట్రంపై త్వ‌ర‌లో క్లారిటీ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే,ఆయ‌న క్లారిటీ ప‌రోక్షంగా ఇచ్చేశార‌ని అంటున్నారు. తాజాగా ఆయ‌న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యార‌ని, ఓ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాజీ జేడీ ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన అనంత‌రం ఆయ‌న రాజ‌కీయ నాయుకుడి రోల్‌లోకి మారిపోతార‌ని అంతా ఊహించారు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఇంకా స‌మ‌యం ఉంద‌ని ప్ర‌క‌టించిన మాజీ జేడీ ఈ క్ర‌మంలో ప‌లు కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టారు. త‌న స్వ‌గ్రామంలో రైతుల‌తో భేటీ అయిన ల‌క్ష్మీనారాయ‌ణ దానికి కొన‌సాగింపుగా ప‌లు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తనను ఓ సామాజికవర్గంతో అంటగట్టారని.. సంఘంతో అనుబంధం ఉంది కాబట్టి ఇంకో పార్టీ వైపు వెళతా అంటున్నారని.. అయితే ఆ వార్తలు సత్యదూరమన్నారు. సామాజికవర్గం గుమ్మం వరకే ఉంటుందని, తాను ఏ పార్టీలో చేరడం లేదని లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే, తాజాగా ఆయ‌న ప‌చ్చ‌పార్టీ అధినేత‌తో భేటీ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం రాజ‌కీయ అరంగేట్రానికి సిద్ధ‌మైన మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుతో భేటీ అయిన‌ట్లు స‌మాచారం. మాజీ ఐపీఎస్ అధికారి ప్ర‌జాసేవ చేయాల‌నుకోవ‌డం, రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం...ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి పోటీగా బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం చూస్తున్నామ‌ని టీడీపీ అధినేత వెల్ల‌డించ‌డం వంటి అంశాలు చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు ప‌లువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ ఇద్ద‌రు ముఖ్యుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లో ఈ మేర‌కు ఒక అవ‌గాహ‌న కుదిరింద‌ని, త్వ‌ర‌లోనే పార్టీలో చేరిక‌, అధికారికంగా ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని జోస్యం చెప్తున్నారు.

Tags:    

Similar News