ప్రతిపక్షాల గాలి తీసేసిన జేడీ

Update: 2021-05-20 08:30 GMT
జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు ఎంతో ఇష్టుడు అయినా మాజీ జేడీ లక్ష్మీనారాయణే ఇపుడు ప్రతిపక్షాల గాలిని తీసేశారు. నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్టు పై నానా గోల చేస్తున్న ప్రతిపక్షాల నేతల నోళ్ళు ఒక్కసారిగా మూతపడిపోయేట్లుగా షాక్ ఇచ్చారు. నిజానికి రఘురామ వైసీపీ ఎంపి అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే జగన్-రఘురామకు ఏ విషయంలో కూడా పడటం లేదన్న విషయం కూడా తెలిసిందే. జగన్ పై ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడిన మాటలు చివరకు హద్దుమీరి పోవటంతో సీఐడీ ఉన్నతాధికారులు ఎంపిని అరెస్టుచేశారు.

ఎంపి అరెస్టన్నది అధికారపార్టీ అంతర్గత వ్యవహారం. ఎంపిని సస్పెండ్ చేస్తారా ? బహిష్కరిస్తారా ? అనర్హత వేటు వేయిస్తారా ? లేకపోతే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అన్నది అధికారపార్టీ, ఎంపి తేల్చుకోవాలి. ఇందులో ప్రతిపక్షాలకు సంబంధమే లేదు. కానీ ఎంపిని అరెస్టు చేయగానే చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, లోకేష్ అండ్ కో చాలా విచిత్రంగా స్పందించేస్తున్నారు. ఇక సీపీఐ, జనసేన, బీజేపీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు.

స్పీకర్ అనుమతి లేకుండా ఎంపిని అరెస్టు చేయకూడదని, ఎంపికి ఉండే ప్రివిలేజెస్ ను పట్టించుకోకుండా విచారణకు తీసుకున్నారంటు చంద్రబాబు అండ్ కో నానా రచ్చ చేస్తున్నారు. అయితే ఇలాంటి అనేక విషయాల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టమైన వివరణ ఇచ్చారు. లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారన్న విషయం తెలిసిందే. అరెస్టుల విషయంలో ప్రభుత్వాలు అనుసరించాల్సిన నియమాలు, నిబంధనల్లో మాజీ ఐఫీఎస్ కన్నా చంద్రబాబు అండ్ కో కు ఎక్కువ తెలుస్తుందని అనుకునేందుకు లేదు.

తాజాగా జేడీ చెప్పిన విషయం ఏమిటయ్యా అంటే ఎంపి అరెస్టుకు స్పీకర్ అనుమతి అవసరమే లేదని. ఎంపిని అరెస్టు చేసిన తర్వాత స్పీకర్ కు సమాచారం ఇస్తే చాలట. కాకపోతే పార్లమెంటు, అసెంబ్లీ సెషన్ జరుగుతున్నపుడు మాత్రం ముందుగా సమాచారం ఇచ్చి అరెస్టు చేయవచ్చట. అదికూడా సమాచారం మాత్రమే అనుమతి అవసరంలేదన్నారు.

ఇక చంద్రబాబు అండ్ కో చెబుతున్నట్లు ఎంపిలకు ప్రివిలేజెస్ లాంటివి ఏవీ ఉండవని లక్ష్మీనారాయణ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మామూలు వ్యక్తులకు ఉన్న హక్కులే తప్ప ప్రజా ప్రతినిధులన్న హోదాలో ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఏవీ ఉండవన్నారు. సరే కేసును బట్టి బెయిల్, అనారోగ్యాన్ని బట్టి వైద్యం లాంటి విషయాల్లో అంతిమ నిర్ణయం జడ్జీదే అని కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన తర్వాతయినా ప్రతిపక్షాలు ప్రివిలేజెస్ అంటు చేసే గోల ఆపేస్తేరా ?


Tags:    

Similar News