సీబీఐ మాజీ జేడీకి కేసీఆర్ ఆప్తులు ఇంత దోస్తులా?

Update: 2018-08-08 15:42 GMT
సీబీఐ మాజీ జేడీ - త‌న ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నట్లు సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ మాజీ ఐపీఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ తదుప‌రి అడుగుల‌పై కొత్త చ‌ర్చ మొద‌లైంది. క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు అడుగులు వేస్తున్న ఆయ‌న‌..అందుకు త‌గిన రీతిలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే అదే స‌మ‌యంలో పొలిటిక‌ల్ ఎంట్రీ వంటిదేమీ ఉంద‌డంటూ ప్ర‌క‌టిస్తున్నారు. స్థూలంగా మాజీ ఐపీఎస్ అధికారి క్లారిటీ ఇచ్చారో క‌న్ఫ్యూజ్ చేశారో తెలియ‌డం లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ్య‌క్తిత్వ‌వికాసానికి సంబంధించి రాజ‌మండ్రిలో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొనేందుకు మాజీ ఐపీఎస్ ల‌క్ష్మీ నారాయ‌ణ అక్క‌డ‌కు వెళ్లారు. అయితే ల‌క్ష్మీ నారాయ‌ణ ఈ కార్య‌క్ర‌మానికే ప‌రిమితమే కాకుండా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య నారాయ‌ణ ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. కొద్దికాలం క్రిత‌మే ఆయ‌న బీజేపీ మాతృక అయిన రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ కార్యాక్ర‌మంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్నారా? అనే చ‌ర్చ మొద‌లైంది.

అయితే, ఇలా కొద్దికాలం వ‌ర‌కు ఏపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ల‌క్ష్మీనారాయ‌ణ తెలంగాణ‌లో త‌న ఎంట్రీ ఇచ్చారు. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఆయ‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ను స‌ర్వం తానై న‌డిపించింది అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు. ముఖ్య‌మంత్రి  - టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు స‌న్నిహితుడైన ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు. ఔను! పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆహ్వానం మేరకు ఆయనతో కలిసి తొర్రూరులోని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా కొన్ని రోజులుగా కొనసాగిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. తొర్రూరుకు వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ - పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు టీఆర్ ఎస్ - యువజన విభాగం నాయకులు - యువకులు ఘన స్వాగతం పలికారు. సుమారు 500 బైకులకు పైగా పాలకేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు.. అటు నుంచి ఎర్రబెల్లి చారిటబుల్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ల‌క్ష్మీనారాయ‌ణ ప‌లు సూచనలు చేశారు. 2025 నాటికి దేశం 75 శాతం యువతతో నిండుతుందన్నారు. దేశానికి ఉపయోగపడే నైపుణ్యం గల వ్యక్తులుగా తయారు కావాలన్నారు.స్వామి వివేకానంద ఉద్బోధించినట్లు ప్రతీ యువకుడుమంచి ఆలోచన విధానాన్ని స్వీకరించడం, గొప్ప వ్యక్తుల స్వీయ చరిత్రలు, ఆటోబయోగ్రఫీలు చదవడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి లక్షణాలు కలిగిన యువత ద్వారానే దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.

 కాగా, అధికార టీఆర్ ఎస్‌ పార్టీకి  చెందిన ముఖ్య నాయ‌కుల్లో ఒక‌రిగా పేరొందిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు...త‌న సొంత ట్ర‌స్ట్ సంబంధించిన కార్య‌క్ర‌మాల‌కు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆహ్వానించ‌డం, స్వ‌యంగా ద‌గ్గ‌రుండి ఆహ్వానం ప‌లికి హ‌డావుడి చేయ‌డం చూస్తుంటే... జేడీకి తెలంగాణలో స‌న్నిహితులు గులాబీ పార్టీ నేత‌లేనా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.
Tags:    

Similar News