కాంగ్రెస్ తోనే కలిసి నడుస్తారట!

Update: 2019-05-20 08:19 GMT
భారతీయ జనతా పార్టీని అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో కర్ణాటకలో కాంగ్రెస్‌ తో జేడీఎస్‌ జత కట్టింది. అయితే ఏడాది ముగిసే లోపు రెండు పార్టీల మధ్య ఎన్నో విభేదాలు వచ్చాయి. ఫలితంగా ఈనెల 23వ తేదీ తర్వాత కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి తోడు జేడీఎస్‌ నేతలు కొందరు.. కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటుకు తాము కాంగ్రెస్‌ ఇంటి వద్దకు వెళ్లలేదని.. ఉంటే మైత్రి ఉండవచ్చు.. లేదంటే వెళ్లిపోవచ్చని బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ఈనెల 29న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఒంటరిగా బరిలో దిగాయి. ఈనేపథ్యంలో లోక్‌ సభ ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ – జేడీఎస్‌ విడిపోతాయనే ప్రచారం జోరుగా సాగింది. ఫలితంగా జేడీఎస్‌ తో జత కట్టి నిండా మునిగామని కాంగ్రెస్‌ నాయకులు హైకమాండ్‌ కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే లోక్‌ సభ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా మైత్రి కొనసాగిస్తుందని జేడీఎస్‌ పార్టీ అధినేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా జేడీఎస్‌ తో కలిసి వెళ్లాలని ఏఐసీసీ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ నాయకులకు హెచ్చరించారు.

23వ తేదీ లోక్‌ సభ ఫలితాల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందనే పుకార్లకు ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. త్వరలో బీజేపీ ఆపరేషన్‌ కమల్‌ చేపట్టి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్న సమయంలో కమలనాథులకు దళపతులు గట్టి షాక్‌ ఇచ్చారు. అంతేకాకుండా జేడీఎస్‌ తో నిండా మునిగామని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులకు పరోక్షంగా షాక్‌ ఇచ్చారు. కర్నాటకలో తమకు సీఎం పదవి కట్టబెట్టిన నేపథ్యంలో కేంద్రంలో ప్రధాని పదవిని రాహుల్‌ కోసం త్యాగం చేస్తున్నట్లు దేవెగౌడ గతంలో ప్రకటించారు. అంతేకాకుండా ఐదేళ్ల పాటు కుమారస్వామి సీఎంగా కొనసాగుతారని సోనియా - రాహుల్‌ లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారని కూడా దేవెగౌడ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో రాహుల్‌ గాంధీ కూడా కర్ణాటక కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.
 
కర్ణాటకలోని 224 ఎమ్మెల్యే స్థానాలకు గానూ 37 స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్‌ సీఎం కుర్చీని సొంతం చేసుకుంది. అయితే ఆరంభం నుంచి కాంగ్రెస్‌ నాయకులు సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ తో జేడీఎస్‌ నేతలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏడాది కాలంగా నడిపించడంలో విజయం సాధించారని చెప్పవచ్చు. అయితే జేడీఎస్‌ నేతలు సీఎం పీఠాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ తోనే ఉండాలని నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పవచ్చు.

Tags:    

Similar News