మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌

Update: 2015-04-07 06:25 GMT
అధికారంలో ఉన్న వాళ్లు పనులు చేస్తారు. దాంట్లో అవినీతి కూడా చేస్తారు. పాలకులు మారటం తప్ప అవినీతి, ఆరోపణలు మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ అన్నట్లుంది పరిస్థితి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై రగడ మొదలయిన విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌ సింగ్‌ మొదలుపెట్టిన ఈ రచ్చను.. స్థానిక కాంగ్రెస్‌ నేతలు దూకుడుగానే కొనసాగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా అందించే నీళ్లు బట్టలు ఉతకడానికి, స్నానాలకు, బోళ్లు తోముకునేందుకు పనికివస్తాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 73శాతం మంది ప్రజలకు రక్షిత మంచి నీరు అందుబాటులో ఉందని అలాంటపుడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం రూ.40 వేల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు. భారత ప్రభుత్వం అందిస్తున్న సహాయం, నల్లగొండలో ఫ్లోరైడ్‌ శుద్దికి ఏర్పాటు చేసిన ప్లాంట్లు,  హైదరాబాద్‌ లో జీహెచ్‌ఎంసీ, జలమండలి ఏర్పాటు చేస్తున్న ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లతో స్వచ్చమైన నీరు అందడం లేదనే సమస్య తీరే మార్గం ఉందన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే దోచుకునేందుకే వాటర్‌ గ్రిడ్‌ ను తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అవినీతికి పాల్పడింది అంటున్నవారు వాస్తవాలు తెల్చుకోవాలని కోరారు.

మొత్తంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు అవినీతి అంటూ టీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తే... ఇపుడు సీను మారి టీఆర్‌ఎస్‌ పీఠం ఎక్కిన నేపథ్యంలో కాంగ్రెస్‌ వారు అదే విమర్శలను మొదలెట్టారు. ఎవరు దోచుకుంటున్నారో...ఎవరు ప్రజల పక్షం ఉంటున్నారో  అర్థంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి.
Tags:    

Similar News