అబ్బో.. బీజేపీ గొప్ప స్నేహితుడే దొరికాడే!

Update: 2015-06-12 05:09 GMT
బిహార్‌లో భారతీయ జనతా పార్టీని ఎలాగైనా కట్టడి చేయాలని అన్ని పార్టీలూ ఏకం అయిపోయాయి. కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ.. ఇలా అందరూ ఉమ్మడిశక్తిగా మారారు. అందరూ కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి సిద్ధం అయ్యారు. మోడీ ఆధ్వర్యంలో ఎన్నికలకు వస్తున్న బీజేపీని ఎలాగైనా బిహార్‌లో నిలువరించాలి.. తద్వారా సత్తా చాటుకోవాలని వారంతా భావిస్తున్నారు. దీని కోసం వాళ్లు తమ ఇగోలను పక్కనపెట్టారు. విధానాలను, వివాదాలను పక్కనపడేసి ఆ పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ఇప్పుడు బీజేపీని అడ్డుకోకపోతే మళ్లీ అడ్డుకోవడం సాధ్యం కాదు.. అనే భావన అక్కడి రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది.

    మరి వారిలో ఎక్కడలేని ఐక్యత కనిపిస్తోందిప్పుడు. వారందరూ బీజేపీని ఓడించడం అనే ఉమ్మడిలక్ష్యాన్ని పెట్టుకొన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందనేదీ ఆసక్తికరమైన అంశమే.

    ఇందుకు సంబంధించి తాజా అప్‌డేట్‌ ఏమిటంటే.. ఈ ఎన్నికల్లో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్‌ మాంఝీని కలుపుకుపోతున్నట్టుగా బీజేపీ ప్రకటించింది. ఆయనతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తామని బీజేపీ జాతీయాధినేత అమిత్‌షా స్వయంగా ప్రకటించుకొన్నారు.

    మరి మాంఝీ ఏమీ గొప్ప ప్రజానేతగా కనిపించడం లేదు. పైపెచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన తీరుతో వివాదాలు సృష్టించాడు. దేశవ్యాప్తంగా ఆ వివాదాలకు ప్రచారం లభించింది. అలాంటి వ్యక్తితో పొత్తు అంటూ.. భారతీయ జనతా పార్టీ ఏదో తురుపుముక్కను ప్రయోగించినట్టుగా ప్రకటించుకొంటోంది! దీని ఫలితాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News