ట్రంప్ పై 40 లక్షల ఓట్లతో గెలుస్తున్నా: జోబైడెన్

Update: 2020-11-07 10:50 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై 40 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో తాము గెలుస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్లను ఓడించిన అనేక రాష్ట్రాల్లో నేడూ గెలుస్తున్నామన్నారు.

గెలుపు లాంఛనమై మ్యాజిక్ ఫిగర్ కు చేరువైన సందర్భంగా జోబైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించట్లేదని.. అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో తాము గెలుస్తామని తెలిపారు. జార్జియా, పెన్సిల్వేనియాలో ముందంజలో ఉన్నామని.. 24 ఏళ్ల తర్వాత జార్జియా, అరిజోనాలో తొలిసారి డెమొక్రాట్స్ గెలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధిస్తామని.. 300కు పైగా ఎలక్ట్రోరల్ ఓట్లు సాధిస్తామని బైడెన్ గెలుపుపై ధీమాగా చెప్పారు.

అమెరికన్లు మార్పులు కోరుకున్నారని.. మతాలు, ప్రాంతాలకు అతీతంగా తనను గెలిపించబోతున్నారని.. ఈ నేపథ్యంలోనే కోవిడ్ వైరస్, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పు, జాతి విద్వేషం తదితర అంశాల్లో మేం ప్రకటించిన ప్రణాళికలను  అమలు చేస్తామని.. ప్రజలకు ఊరట కల్పిస్తామని జోబైడెన్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తొలి రోజు నుంచే తమ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. కరోనాకే తమ తొలి ప్రాధాన్యత అన్నారు. ఆందోళనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా సంయమని పాటించాలని.. రాజకీయం వేరు.. ఇక ఎన్నికలు అయిపోవడంతో  ఇప్పుడు మనమంతా అమెరికన్లం అంటూ బైడెన్ పిలుపునిచ్చారు.
Tags:    

Similar News