మా హీరోను కెల‌క్కండి అంటున్న ఫ్యాన్స్‌!

Update: 2021-04-15 07:30 GMT
తెలుగుదేశం పార్టీ దారుణంగా అధికారం కోల్పోవ‌డాన్ని సాధార‌ణ కార్య‌క‌ర్త నుంచి.. అధినేత చంద్ర‌బాబు వ‌ర‌కు జీర్ణించుకోలేక‌పోయారు. ఎమ్మెల్యేల సంఖ్య మ‌రీ.. 23కు ప‌డిపోవ‌డంతో.. పార్టీపై జ‌నాల్లో అంత వ్య‌తిరేక‌త ఉందా? అంటూ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. జ‌నాలు తొంద‌ర‌ప‌డి ఓటేశారు.. త్వ‌ర‌లోనే నిజం తెలుసుకుంటారు అని చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ.. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే.. చేదు నిజం తెలుసుకోవాల్సి వ‌చ్చింది. ప‌సుపు పార్టీపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం లేద‌ని తేల్చాశాయి ఈ ఎన్నిక‌లు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 85 శాతానికిపై వైసీపీ మ‌ద్ద‌తు దారులు గెలిస్తే.. మునిసిప‌ల్ పోరులో ఏకంగా 90 శాతం స్థానాలనున కైవ‌సం చేసుకున్నారు. దీంతో.. టీడీపీ భ‌విష్య‌త్ క‌ళ్ల ముందు క‌ద‌లాడుతున్న‌ట్టుంది పార్టీ శ్రేణుల‌కు. ఇక‌, చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని, టీడీపీ ప‌గ్గాల‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ చేప‌ట్టాల్సిన స‌మ‌యం వ‌చ్చిందంటూ బాహాటంగానే కామెంట్లు చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ డిస్క‌ష‌న్ పెడుతున్నారు.

ఇలాంటి చ‌ర్చ తీసుకొస్తున్న‌వారిలో కొంద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. మ‌రికొంద‌రు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇంకా‌.. జూనియ‌ర్ ఫ్యాన్స్ కూడా కొంద‌రు ఉన్నారు. ఎన్టీఆర్ రాక‌పోతే.. టీడీపీ ప‌త‌నం ఖాయ‌మ‌ని కూడా వారు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. లోకేష్ పార్టీని న‌డిపించే ప‌రిస్థితి లేద‌ని ఒక స్థాయి న‌మ్మ‌కం పార్టీలో వ‌చ్చేసిన‌ట్టుంది. పార్టీ నేత‌లు కూడా బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం తెలిసిందే. దీంతో.. అంద‌రికీ క‌నిపిస్తున్న‌ది జూనియ‌ర్ ఒక్క‌డే. ఆయ‌న వ‌స్తే పార్టీని ఎక్క‌డికో తీసుకెళ్తున్నాడ‌ని ఆశ ప‌డుతున్నారు.

అయితే.. ఎంట్రీ ఎవ‌రికైనా ఇంట్ర‌స్టింగ్ గానే ఉంటుంది. హంగూ ఆర్భాటాలుగా బాగానే అనిపిస్తాయి. కానీ.. దిగిన త‌ర్వాత ప‌రిస్థితులు మొత్తం మారిపోతాయి. ఏవీ చేతుల్లో ఉండ‌వు. కీడెంచి మేలెంచుతూ.. నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. దారుణ ఫ‌లితాలు అనుభ‌వించాల్సి వ‌స్తుంది. ఇక‌, సినిమా హీరోగా ఉన్నప్పుడు అభిమానం వేరు.. ఒక పార్టీకే ప‌రిమిత‌మైన నేత‌గా మారిన‌ప్పుడు చూసే విధానం వేరు. ఇది గ‌తంలో చాలా సార్లు నిరూపిత‌మైంది. ఇప్పుడు.. జూనియ‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు కొంద‌రు అభిమానులు.

అందుకే.. రాజ‌కీయాల పేరుతో త‌మ హీరోను కెల‌కొద్ద‌ని అంటున్నారు కొంద‌రు ఫ్యాన్స్‌. సినిమాల్లో జూనియ‌ర్ సాధించాల్సింది ఇంకా చాలా ఉంద‌ని, ఆయ‌న‌కు ఇంకా ఎంతో భ‌విష్య‌త్ ఉంద‌ని అంటున్నారు. టాలీవుడ్లోని బెస్ట్ యాక్టర్స్ లో ఒక‌డిగా ఉన్న జూనియ‌ర్ ను.. రాజ‌కీయ రొచ్చులోకి లాగొద్ద‌ని కోరుతున్నారు. ఇక‌, అవ‌స‌రం ఉన్నంత సేపు వాడుకొని.. తీరిన త‌ర్వాత కూర‌లో క‌రివేపాకులా తీసిప‌డేయ‌డం చంద్ర‌బాబు లాంటి నేత‌ల‌కు అల‌వాటేన‌ని అంటున్నారు. అందువ‌ల్ల‌.. త‌మ హీరోను సినిమాలు చేసుకోనివ్వాల‌ని, పొలిటిక‌ల్ బుర‌ద పూయొద్ద‌ని అంటున్నారు. మ‌రి, జూనియ‌ర్ ఏమంటాడో చూడాలి.
Tags:    

Similar News