మనవడా ఎక్కడ ఉన్నావ్...జూనియర్ కి కొత్త‌ పితలాటకం!

Update: 2022-09-21 17:30 GMT
అదేంటో తెలుగు నాట కూడా సినిమాకు రాజకీయానికి మధ్య సన్నని పొర తెగిపోయింది. తమ మానాన తాము సినిమాలు చేసుకుంటూ ఉన్నా కూడా వారిని  కెలుకుతారు. తప్పదు, బంధాలు బహు గట్టివి. అందునా నందమూరి ఫ్యామిలీ అటు సినిమాకూ ఇటు రాజకీయానికి వేసిన ముడి ఇంకా గట్టిది. అందుకే ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం యావత్తు సినీ పరిశ్రమను కూడా ఉలిక్కిపడేలా చేస్తోంది. చాలా మంది తమ భావనను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు.

విజయవాడలో ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి శ్రీకారం చుట్టిన ఎన్టీయార్ పేరునే అక్కడ నుంచి తొలగించడం పట్ల తెలుగు సమాజం భగ్గుమంటోంది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా తన ఆందోళనను తాను చేస్తోంది. కానీ దివంగతుడై, తెలుగు నాట చిర కీర్తిని మిగిల్చి వెళ్ళిపోయిన ఎన్టీయార్ విషయంలో ఇలా చేయడం కంటే అన్యాయం వేరొకటి ఉండదు అని అంటున్నారు.

అసలు ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ కి సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ తలచుకుంటే సంబంధం బహు చక్కగా ఏర్పడిపోయింది. రాత్రికి రాత్రే పేరు మారిపోయింది. ఇది తప్పు అని అంతా అంటున్నా సర్కార్ మాత్రం తన దూకుడుతనంతో ముందుకే వెళ్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ పోరాటం కానీ తెలుగు సమాజంలోని ప్రముఖుల ఆవేదన కానీ ఒక ఎత్తు. ఎన్టీయార్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అన్నదే అందరి ఆలోచనగా ప్రశ్నగా  ఉందిపుడు.

ముఖ్యంగా ఎన్టీయార్ ముద్దుల మనవడిగా ఉంటూ తెలుగు సినీ రంగాన స్టార్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన జూనియర్ ఎన్టీయార్ ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విషయంలో రెస్పాండ్ కావాల్సిందే అని అంతా అంటున్నారు. జూనియర్ రెస్పాండ్ అయితే ఆ కధే వేరుగా ఉంటుందని చెబుతున్నారు. జూనియర్ ని ఈ మధ్యనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలసి వెళ్లారు. ఆయన ఎంత వద్దు అనుకున్నా రాజకీయం ఆయన ఇంట్లో వంట్లో కూడా ఉంది.

ఇంకో వైపు కష్టకాలంలో టీడీపీకి జూనియర్ సేవలు అవసరమని కూడా తమ్ముళ్ళు అంటున్నారు. ఆ మధ్యన చంద్రబాబు ఫ్యామిలీ మీద వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా జూనియర్ స్పందన కోసం అంతా ఎదురు చూశారు. అయితే జూనియర్ వీడియో సందేశం ఒకటి ఇచ్చినా కూడా అందులో ఘాటుగా కామెంట్స్ లేవని టీడీపీ వారే బాహాటంగా విమర్శించారు.

ఇపుడు మళ్ళీ జూనియర్ చుట్టూ పొలిటికల్ కెమెరా తిరుగుతోంది. ఆయన రియాక్ష‌న్ కోసం అంతా చూస్తున్నారు. ఇది నాకు కాదు, సంబంధం లేదు అని ఆయన అనలేని పరిస్థితి ఉంది అంటున్నారు. మనవడిగా జూనియర్ కచ్చితంగా దీని మీద రియాక్ట్ కావాల్సిందే. అది కూడా వైసీపీలోనే ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున  ప్రకంపనలు రేగుతూంటే మౌనంగా ఉండడం సబబు కాదని అంటున్నారు. ఒకనాడు హరిక్రిష్ణకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైసీపీ సర్కార్ ఇచ్చిన తన పదవులకు ఒక్క దెబ్బకు  రాజీనామా చేశారు.

ఇక వైసీపీ జెండా మోస్తున్న వల్లభనేని వంశీ కూడా ఇది తప్పు అని  తాను ఉంటున్న పార్టీనే తప్పు పట్టారు. మరి జూనియర్ ఈ సమయంలో పెదవి విప్పాల్సిందే అని సోషల్ మీడియాలో అంతా ఒక్కటై డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎప్పటిలాగానే సైలెంట్ గా ఉంటారా లేక మా తాత గారి పేరు ఉంచండి అని జగన్ సర్కార్ కి వినతి చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా మంచి పితలాటకం జూనియర్ కి వచ్చి పడింది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News