సీఎం జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్య.. జడ్జి రామకృష్ణ అరెస్టు.. జైలు!

Update: 2021-04-16 05:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై చిత్తూరు జిల్లా బి. కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణ అరెస్టు చేశారు. అనూహ్య పరిణామాల్లో ఆయన అరెస్టు జరిగింది. దీంతో.. ఆయన్ను గురువారం సాయంత్రం పీలేరు కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి రామకృష్ణ అరెస్టు ఈ నెల 28 వరకు రిమాండ్ కు న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల పన్నెండున జరిగిన టీవీ డిబేట్ లో జడ్జి రామక్రిష్ణ సీఎం జగన్ పై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేసినట్లుగా మాజీ జెడ్పీటీసీ జి. జయరామచంద్రయ్య ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పీలేరు పోలీసులు.. రామకృష్ణపై కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో పరీక్ష కోసం రామకృష్ణ బి.కొత్తకోట నుంచి మదనపల్లెకు వచ్చారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రానికి రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసిన తర్వాత కోర్టుకు హాజరు పర్చారు. ఇదిలా ఉంటే.. తనను అరెస్టు చేసిన వైనంపై రామకృష్ణ మండిపడ్డారు. తనను అరెస్టు చేయటం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైందన్నారు.

దళితుల పక్షం వహించి టీవీ డిబేట్ లో ప్రశ్నించినందుకు తనపై కేసు నమోదు చేశారన్నారు.నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని ప్రస్తుత సీఎం జగన్ వ్యాఖ్యలు చేయటాన్ని గుర్తు చేశారు.  జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పినందుకు తనను అరెస్టు చేశారని మండిపడుతున్నారు.

ఇంతకీ.. రామకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటన్నది చూస్తే.. ‘‘జగన్మోహన్ రెడ్డి కంసుడిలా తయారయ్యాడు. ఈ రాక్షసుడిని.. రాక్షస పాలనను అంతం చేయటానికి.. నేను క్రిష్ణుడిగా భావిస్తున్నా. కంసుడు.. నరకాసుడైన జగన్ ను ఎప్పుడు శిక్షించాలా? అని ఎదురు చూస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. రామకృష్ణపై సెక్షన్ 124ఏతో పాటు.. 153.. 153ఏ సెక్షన్లను కూడా నమోదు చేశారు. రామకృష్ణను గతంలోనూ ఒక కేసులోనూ అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News