డిజిటల్ మీడియాతో ‘న్యాయ’ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2021-05-07 02:30 GMT
మీడియాను కట్టడి చేయాలంటూ ఎన్నికల సంఘం (ఈసీ) కోరడం భావ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంటర్నెట్ వ్యాప్తితో పెరిగిన డిజిటల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థకు సంబంధించిన వార్తల రిపోర్టింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. కోర్టుల రియల్ టైం అప్డేట్స్ కూడా పత్రికా స్వేచ్ఛ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

అంతర్గత లేదా వీడియో కెమెరాల మధ్య సాగే విచారణలు తప్ప కోర్టులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు రాజ్యాంగం ప్రకారం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్జీలు చేసే మౌఖిక వ్యాఖ్యలను రిపోర్ట్ చేసే హక్కు మీడియాకు ఉంటుందని.. అలాంటి మీడియాను కట్టడి చేయాలంటూ ఎన్నికల సంఘం కోరడం భావ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎన్నికలు నిర్వహించిన ఈసీపై హత్య కేసు ఎందుకు పెట్టరాదంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన దరిమిలా ఒక రాజ్యాంగ వ్యవస్థను ఉద్దేశించి కోర్టులు చేసే సదురు వ్యాఖ్యలు మీడియా రిపోర్టు చేయడాన్ని కట్టడి చేయాలంటూ ఈసీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది.

విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌళిక వ్యాఖ్యలను ప్రచురించవద్దని ఆదేశించాలని ఈసీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మీడియాను నియంత్రించడం తిరోగమన చర్య అవుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎన్నికల కమిషన్ బాధ్యతరాహిత్యాన్ని ఎత్తిచూపుతూ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 26న ఓ కేసు విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈసీపై హత్యానేరం కింద కేసులు ఎందుకు పెట్టరాదంటూ జడ్జీలు మౌఖిక వ్యాఖ్యలుచేయడం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురించడాన్ని తప్పు పట్టిన ఈసీ.. మీడియాపై ఆంక్షలు విధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా చివరకు చుక్కెదురైంది.
Tags:    

Similar News