నేడే జస్టిస్‌ రమణ ప్రమాణస్వీకారం...!

Update: 2021-04-24 04:06 GMT
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు 48 వ ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ తో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించనున్నారు. ఇకపోతే , మొదటి సారి తెలుగు వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయబోతుండటం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ,  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషమ్మ, హోంమంత్రి అమిత్‌ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సుప్రీంకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తులు, కేబినెట్‌ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి తదితరులకు ఆహ్వానం అందింది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందించారు.  

కాగా, 2014 ఫిబ్రవరి 17 వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.  1957 ఆగష్టు 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో ఎన్వీ రమణ జన్మించారు.  జూన్ 27, 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ రమణ మాతృభాషను అమితంగా అభిమానిస్తారు. సభలు, సదస్సుల్లోనూ తెలుగులో మాట్లాడటానికే ఇష్టపడతారు.  సీజేఐగా జస్టిస్‌ రమణ హయాంలో న్యాయపరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఆయన ఎన్నాళ్లుగానో ఆకాంక్షిస్తున్నారు. జస్టిస్‌ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26వ తేదీ వరకు చీఫ్‌ జస్టిస్‌ పదవిలో ఉంటారు.

జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ వివరాల్లోకి వెళ్తే .. అయన కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు గణపతిరావు, సరోజనీ దేవి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ  ఎన్వీ రమణ కష్టపడి చదువుకున్నారు. ఆయన విద్యాభ్యాసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగింది.

ఇక ఇదిలా ఉంటే ..సుప్రీం 47వ అధిపతిగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు సీజేగా ఆయన 17 నెలల పాటు పనిచేశారు. నేను చేయగలిగినంత చేశానన్న పూర్తి సంతృప్తితో ఇక రిటైర్ అవుతున్నా , సంతోషంగా, సుహృద్భావంతో, మధురమైన జ్ఞాపకాలతో వీడుతున్నాను. అత్యుద్భుతమైన వాద ప్రతివాదనలు, ప్రజంటేషన్లు, మంచి ప్రవర్తన, న్యాయం జరగాలన్న అంశానికి కంకణ బద్ధులు కావడం  వీటన్నింటినీ చూశాను. 21 సంవత్సరాల పాటు జడ్జిగా పనిచేశాను. సుప్రీంలో పనిచేయడం గొప్ప అనుభూతి. ఇప్పుడు ఆ బాధ్యతను జస్టిస్‌ ఎన్‌ వీ రమణకు అప్పగిస్తున్నాను. ఆయన సమర్థంగా ఈ కోర్టుకు సారథ్యం వహించగలరని నేను విశ్వసిస్తున్నాను అని ఆయన కోర్టు హాల్లోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఎన్నో ఎళ్లుగా మగ్గిపోతున్న  అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదంపై కీలక తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సహా అనేక కీలక కేసుల బెంచ్‌ల్లో పనిచేసిన జస్టిస్‌ బోబ్డే.. కొవిడ్‌ సమయంలో కోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనిచేసేట్లు చేయడంలో ఎంతో కృషిచేశారు. కాగా, 1956 ఏప్రిల్‌ 24న నాగ్‌పూర్‌లో పుట్టిన బోబ్డే బీఏ ఎల్‌ఎల్‌బీ చేశారు. 1978లో లాయర్‌గా ప్రాక్టీసుతో బాంబే హైకోర్టులో 21 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టులో జడ్జిగా, మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా పనిచేశారు. 2013లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2019 నవంబరు 18న సీజేఐ అయ్యారు.
Tags:    

Similar News