ఆ స‌ల‌హాదారుకు ప‌ద‌వి వెనుక ఆ స్వామీజీ చ‌క్రం తిప్పారా?

Update: 2022-08-06 02:38 GMT
ఏపీలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే దాదాపు 70 మందికిపైగా స‌ల‌హాదారులు ఉన్నార‌ని.. వారికి పెద్ద ఎత్తున ప్ర‌జాధనాన్ని జీతాల రూపంలో చెల్లిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను లెక్క‌చేయ‌డం లేదంటున్నారు.

తాజాగా దేవ‌దాయ శాఖ స‌లహాదారుగా ఏపీ బ్రాహ్మ‌ణ సేవా సంఘ స‌మాఖ్య అధ్యక్షుడిగా ఉన్న‌ జ్వాలాపురం శ్రీకాంత్ ను నియ‌మించడం ఇందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. అయితే శ్రీకాంత్ నియామ‌కం వెనుక జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆస్థాన స్వామీజీలాంటి ఒక వ్య‌క్తి చ‌క్రం తిప్పాడ‌ని ఒక ప్ర‌ధాన ప‌త్రిక‌లో వార్త‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్‌ ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను శాసిస్తున్న ఓ కీలక స్వామీజీకి శ్రీకాంత్ ముఖ్యమైన శిష్యుడిగా ఉన్నార‌ని స‌మాచారం. గతంలో ఆ స్వామీజీని అనంతపురానికి ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించార‌ని కూడా చెబుతున్నారు.

ఆ స్వామీజీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను సైతం త‌న వ‌ద్దకే ర‌ప్పించుకోగ‌ల సామ‌ర్థ్యం ఉన్న‌వార‌ని.. ఆయ‌న చెప్ప‌డంతో జ్వాలాపురం శ్రీకాంత్‌ను దేవాదాయ శాఖ స‌ల‌హాదారుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని వార్త‌ల సారాంశం. వాస్త‌వానికి ఏపీ బ్రాహ్మ‌ణ స‌మాఖ్య మూడు ముక్క‌లుగా చీలింద‌ని.. ఒక ముక్క‌కు శ్రీకాంత్ అధ్య‌క్షుడిగా ఉన్నార‌ని అంటున్నారు.

అనంత‌పురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ ముందు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) స‌భ్యుడిగా అవ‌కాశం ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని.. అది ద‌క్క‌క‌పోవ‌డంతో ఆ స్వామీజీ సిఫార‌సుల‌తో దేవ‌దాయ శాఖ స‌ల‌హాదారు ప‌ద‌వి కొట్టేశార‌ని ప్ర‌ధాన మీడియా పేర్కొంది.

కాగా జ్వాలాపురం శ్రీకాంత్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌విలో రెండేళ్లు ఉంటారు. ఈయ‌న‌కు జీత‌భ‌త్యాల కింద నెల‌కు 1.50 ల‌క్ష‌ల పైనే ఇస్తార‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు జీవో కూడా విడుద‌ల‌యిందని స‌మాచారం.

కాగా శ్రీకాంత్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో సమన్వయకర్తగా కొంతకాలం ఉన్నార‌ని తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వాస్తవానికి దేవాదాయశాఖలో సలహాదారు పోస్టు ప్రత్యేకంగా లేదని అంటున్నారు. దానికి విధులు, బాధ్యతలు వంటివి తెలిపే ఉత్తర్వులూ లేవని చెబుతున్నారు. ఈ ప‌ద‌విని సృష్టించ‌డం  రాజకీయ పునరావాసంగానే చూడాల్సి ఉంటుంద‌ని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News