ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరిన టీఆర్ ఎస్ ఎంపీ

Update: 2017-04-11 13:16 GMT
ప్రాంతాలుగా విడిపోదాం...అన్న‌ద‌మ్ములుగా క‌లిసి ఉందాం అని తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ను టీఆర్ ఎస్ పార్టీ ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్న‌ట్లుగా ఉంది. తాజాగా ఇది నిజ‌మ‌యింది. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ ఎస్‌ ఎంపీ కే కేశవరావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రాష్ర్టాలకు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేశవరావు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎన్డీసీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా విధివిధానాలపై చర్చ జరపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా పై ఇచ్చిన హామీ రికార్డయ్యిందా అన్న సందేహాన్ని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. ఈ దశలో  డెప్యూటీ చైర్మన్ కురియన్ కలుగజేసుకుని  ఆవిషయాలను ఇక్కడ ప్రస్తావించవద్దన్నారు.  రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశంపై సభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలన్నారు.ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్‌ ప్రభుత్వం చేపట్టిన జిఎస్‌టి బిల్లును స్వీకరించి ఆమోదించిందని జైరాం రమేశ్‌ అన్నారు. అలాగే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చేపట్టిన ఆధార్‌ ను కూడా మోడీ ప్రభుత్వం స్వీకరించిందని ఆయన అన్నారు. మరి మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించిన ఏపీ ప్రత్యేక హోదాను మోడీ ప్రభుత్వం ఎందుకు చేపట్టదని ఆయన ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ లేదని చెప్పిందని ప్రభుత్వం చెబుతోందని కానీ, 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ కానీ, సభ్యులు కాని అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారని ఆయన అన్నారు. జిఎస్‌ టి బిల్లులో పన్నుల విషయమై ప్రస్తావిస్తూ స్పెషల్‌ కేటగిరీ రాష్ట్రాలు ఈ పరిధిలోకి రావని పేర్కొన్నారని జైరామ్ ర‌మేశ్‌ అన్నారు. ఒకవేళ 14వ ఆర్థిక సంఘం పేర్కొన్నట్లు స్పెషల్‌ కేటగిరీ లేకపోతే జిఎస్‌ టి బిల్లులో దాని ప్రస్తావన ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. కాగా, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఎన్డీయే సర్కార్ అధికారంలోనికి వచ్చాకా కేంద్రం నుంచి అందాల్సిన సహాయం అందడం లేదని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు ఎన్డీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఐ సభ్యుడు డి రాజా అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని రాజ్యసభ సాక్షిగా ఇచ్చారని, ఇందకు కారణం ప్రస్తతం కేంద్ర మంత్రులైన వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీలేనని ఆయన అన్నారు. రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ రాజా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ మేరకే నాడు రాష్ట్ర విభజనకు మద్దతిచ్చామని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేవలం హామీ మాత్రమే ఇచ్చారని కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ అన్నారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులను పూర్తిగా ఆమోదించామని ఆయన అన్నారు. ఎన్‌డిసి అప్పట్లో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఆమోదించిందని, ఎపికి ప్రత్యేక హోదాపై ఎన్‌ డిసి ఆమోదం లేదని ఆయన చెప్పారు. నాటి యుపిఎ ప్రభుత్వానికి, తరువాత అధికారంలోకి వచ్చిన తమ ఎన్‌ డిఎ ప్రభుత్వానికి మధ్యలో చాలా సమయం ఉందని, అయినప్పటికీ యుపిఎ ప్రభుత్వం ఎన్‌ డిసి సమావేశం ఏర్పాటు చేసి తమ హామీని ఆమోదింపజేయలేదని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News