ప‌వ‌న్ నాకు గ‌ట్టి త‌మ్ముడు అవుతాడు

Update: 2018-11-25 11:57 GMT
దేశ రాజ‌కీయాల్లో కేవలం రాజ‌కీయ‌మే ఉంది. కానీ తెలుగు రాజ‌కీయాల్లో న‌వ‌ర‌సాలు ఉన్నాయి. సెంటిమెంట్‌... ఎక్స్‌ట్రా. ప్ర‌పంచంలో అన్ని దేశాల అధ్య‌క్షుల‌ను నా చిటికెన వేలుతో ఆడిస్తాను అని చెప్పే కేఏ పాల్ పుణ్య‌మా తెలుగు రాజ‌కీయాలు జ‌బ‌ర్ద‌స్త్‌తో పోటీ ప‌డుతున్నాయి.

తాజాగా ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప‌వ‌న్‌ను త‌గులుకున్నాడు. అబ్బ‌...కుర్రాడు భ‌లే ఉన్నాడు అంటూ ముద్దు చేశాడు. హే మ‌ళ్లీ వేశాడు అంటూ ప‌వ‌న్‌ను టీవీలో చూస్తూ మురిసిపోయాడ‌ట‌. ఈ విష‌యాన్నే ఆయ‌నే లైవ్‌లో చెబుతూ ప‌వ‌న్‌కు ఓ బంప‌రాఫర్ కూడా ఇచ్చాడు. అయితే ప‌వ‌న్ అభిమానులకు చురుక్క‌మ‌నేలా *ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌దు నాకు. నిన్నే మొద‌టి సారి టీవీలో చూశాను* అంటూ వ్యాఖ్యానించాడు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఈ మాట‌ల‌తో హ‌ర్ట్ చేసినా వెంట‌నే ప‌వ‌న్ ఫ్యాన్స్ చెవుల్లో తేనె పోశారు.

*ప‌వ‌న్ చాలా చ‌క్క‌గా మాట్లాడుతున్నాడు. 10 నిమిషాల్లో న‌న్ను ఆక‌ట్టుకున్నాడు. నాకు గ‌ట్టి త‌మ్ముడు అవుతాడు. అత‌డ్ని తీసుకురండి. క‌లుస్తాను. ప్ర‌భువును ప్రార్థించి ముఖ్య‌మంత్రిని చేస్తాను* అంటూ లైవ్‌లో ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. పాపం...ఈ ఆఫ‌ర్‌ను స్వీక‌రించాలో, తిర‌స్క‌రించాలో తెలియ‌క జ‌న సైనికులు త‌ల ప‌ట్టుకునే ప‌రిస్థితి. స్వీక‌రిస్తే కామెడీ అవుతుంది, నీ ఆఫ‌ర్ వ‌ద్దు అన‌డానికి... కేఏ పాల్ గురించి జ‌న సైనికులు మాట్లాడితే అది మ‌రింత కామెడీ అవుతుంది త‌ప్పించి దానిని ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోరు.

పాల్ ఆఫ‌ర్ అంత‌టితో ఆగిపోలేదు. ప‌వ‌న్ వ‌ద్ద డ‌బ్బులేదు. తేలేడు. నేను ఎంత కావాలంటే అంత తేగ‌ల‌ను. అత‌ను అడిగింది ఇవ్వ‌గ‌ల‌ను. సీఎంను చేయ‌గ‌ల‌ను అన్నారు. చిత్ర‌మేంటంటే... టీవీ లైవ్‌ లో ఈ వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ అక్క‌డే ప్రార్థ‌న కూడా చేసేశాడు. *రా నువ్వు రా - నా వ‌ద్ద‌కు రా - నాలో  క‌లిసిపో... నాలో క‌లిస్తే నువ్వు సీఎం అయిపోయిన‌ట్టే. నువ్వు నాకు గ‌ట్టి త‌మ్ముడు* అంటూ ప్రార్థించేశారు.
 
చిరంజీవి గురించి గురించి పాల్ ఓ సీక్రెట్ కూడా చెప్పారు. ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో క‌లుపుతున్న‌ట్టు త‌న స్నేహితుడైన చిరంజీవి ఒక్క మాట కూడా చెప్ప‌లేద‌ట‌. దానికి అప్ప‌ట్లో పాల్ హ‌ర్ట‌య్యార‌ట‌. అలాంటి దుస్థితి ప‌వ‌న్‌కు వ‌ద్ద‌ని ... ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన త‌ప్ప‌కుండా త‌న పార్టీలోనే క‌ల‌వాల‌ని... దానివ‌ల్ల ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని ప్రి మెర్జ్ ఆఫ‌ర్ ఇచ్చారు పాల్‌.

ఇపుడు తెలుగు రాజ‌కీయాలకు ఓ బండ్ల గ‌ణేష్ దొరికారు, ఓ వేణు మాధ‌వ్ దొరికారు... ఓ కేఏ పాల్ దొరికారు. ఓం శాంతి! ప్ర‌జాశాంతి!
Tags:    

Similar News