కాబూల్ ఎయిర్‌ పోర్టులో 40 మంది మృతి... ఆప్ఘాన్‌ లో ఏమౌతుంది?

Update: 2021-08-19 07:37 GMT
ఆప్ఘనిస్థాన్‌ లో తాలిబన్ల రాజ్యం మొదలైననాటి నుంచి ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యం లోనే కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలతో కిక్కిరిసిపోయింది. భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనితో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కాబూల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది యూఎస్ మిలిటరీ. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన తొక్కిసలాట, అమెరికా బలగాల కాల్పుల కారణంగా సోమవారం నుంచి

ఇప్పటి వరకు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ కమాండర్ మొహిబుల్లా తాజాగా వెల్లడించారు. కాబూల్ విమానాశ్రయానికి రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని ఈ తాలిబన్ నేత ప్రజలకు సూచించారు. కాబూల్ విమనాశ్రయంలో సోమవారంనాడు చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసందే. కాగా, కాబూల్ నుంచి సోమవారం ఖతార్ చేరుకున్న తమ వాయుసేన విమానం సీ-17 గ్లోబల్ మాస్టర్ చక్రాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించినట్లు అమెరికా తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.

కాబూల్‌ లో సోమవారం వందలాది మంది ఆ విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించడం, టేకాఫ్ అయ్యాక కూడా కొందరు చక్రాలు, రెక్కల బాగాల వద్ద వేలాడుతూ ప్రయాణించారు. అయితే, విమానం గాల్లోకి ఎగిరాక ఆ ముగ్గురు కిందపడి మృతి చెందారు. ఇది ఇలావుండగా, తాలిబన్ సంస్థ ఆప్ఘనస్థాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్ నగర వాసులు పెద్ద సంఖ్యలో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అప్ఘాన్ జాతీయ జెండా ఉంచాలని డిమాండ్ చేస్తూ, నగరంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంపై ఉన్న తాలిబన్ జెండాను తొలగించి దాని స్థానంలో అప్ఘానిస్తాన్ జాతీయ జెండాను ఎగురవేశారు.

అయితే ఇది జరిగిన నిమిషాల వ్యవధిలో అఫ్గానిస్థాన్ జాతీయ జెండాతో నిరసనకు దిగిన పౌరులపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 12మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, తమ హక్కులను కాపాడాలంటూ మహిళలు పోరాటానికి దిగుతున్నారు. రాజధాని కాబుల్ లో తాలిబన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువరు మహిళలు నిరసన చేపట్టారు. అయితే, తాలిబన్లు మాత్రం తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని చంపేందుకు వెనుకాడటం లేదు.

దీనితో ఆప్ఘాన్ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఆప్ఘన్‌ లో పరిస్థితులు విషమిస్తుండటంతో భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. ఇప్పటికే రాయబార కార్యాలయాన్ని మూసివేసిన భారత్, సిబ్బందిని స్వదేశానికి రప్పించింది. ఇక మిగిలిన భారతీయులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఆప్ఘన్ ప్రజలు కూడా భారత్ బాటపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆప్ఘాన్ చట్టసభ్యులు భారత్‌ కు వచ్చి తలదాచుకున్నారు. ఆప్ఘాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ కూడా దేశం విడిచి కజకిస్థాన్ పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు యూఏఈకి మకాం మార్చినట్లు సమాచారం.


Tags:    

Similar News