బండ్లకు కడప కోర్టు భారీ షాక్.. 14 రోజులు రిమాండ్

Update: 2019-10-24 07:22 GMT
టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాతగా పేరున్న బండ్ల గణేశ్ తరచూ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు లింక్ అయి ఉంటుంది. బడా సినిమాల నిర్మాతగా పేరున్న ఆయన మీద తరచూ ఏదో ఒక ఆర్థిక వివాదానికి సంబంధించిన అంశం తెర మీదకు వస్తుంటుంది. తాజాగా అలాంటిదే మరొకటి రావటం.. గతానికి భిన్నమైన అనుభవం ఆయనకు ఎదురైంది.

కోట్లాది రూపాయిల్ని అప్పుగా తీసుకొని వాటిని తిరిగి చెల్లించకపోవటం.. ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లక బౌన్స్ కావటం.. ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి పదే పదే ప్రయత్నాలు జరిగి.. విసిగి కోర్టును ఆశ్రయించటం లాంటివి బండ్ల గణేశ్ కు సంబంధించి చాలానే వివాదాలు తరచూ తెర మీదకు వస్తుంటాయి. అన్ని కేసులు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు చేసేలా తాజాగా బండ్ల గణేశ్ మీద నమోదైన చెక్ బౌన్స్ కేసు ఆమకు భారీ షాకింగ్ గా మారింది.

బండ్ల గణేశ్ మీద నమోదైన చెక్ బౌన్స్ కేసులో కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విషయాన్ని సింఫుల్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తూ.. ముఖాన నవ్వు చెరగనట్లుగా ఉండే బండ్ల ముఖంగా ఈ రోజు కడప జిల్లా కోర్టులో చాలాసేపు వాడిపోయినట్లుగా మారింది.

2011లో కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ.13 కోట్లు అప్పు తీసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు.

దీంతో.. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వని పరిస్థితి. దీంతో అతడిచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయటం.. అది కాస్తా బౌన్స్ కావటంతో.. తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో బండ్లకు పలుమార్లు కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. వాటి విషయంలో స్పందించింది లేదు.

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇటీవల అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. నిన్న వేరే కేసు (ప్రముఖ నిర్మాత పీవీపీ ఇంటి మీద దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలున్న కేసు)కు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బండ్ల గణేశ్ ను కడప చెక్ బౌన్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులు బండ్ల గణేశ్ వాహనంలో కడపకు తీసుకెళ్లి.. ఈ రోజు జిల్లా కోర్టులో సబ్ మిట్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వారెంట్ ఇష్యూ చేసినా కోర్టుకు హాజరు కాని బండ్ల గణేశ్ మీద కడప జిల్లా మేజిస్ట్రేట్ పద్నాలుగురోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ బెయిల్ ధీమా మీద ఉన్న ఆయనకుషాకిస్తూ.. 14 రోజుల రిమాండ్ ను విధించటంతో అప్పటివరకూ ధైర్యంగా ఉన్న బండ్ల ముఖంలో దిగులు కనిపించినట్లుగా అక్కడి వారు చెబుతున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదేమో?
Tags:    

Similar News