గురు శిష్యుల మధ్య 'కార్' చిచ్చు!

Update: 2018-10-06 10:30 GMT
ఎన్నికల్లో టిక్కెట్లు దొరకని ఔత్సాహికులు అసమ్మతి రాగం వినిపించడం సాధారణం. పార్టీ మారుతున్నట్లు సంకేతాలిస్తుంటారు. మరో పార్టీలో బెర్త్ కాన్ ఫాం చేసుకుంటారు. కానీ, ఇదే టిక్కెట్ల వ్యవహారం గురువు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - శిష్యురాలు సత్యవతి రాథోడ్ మధ్య చిచ్చు రాజేసింది. వరంగల్ జిల్లా టీఆర్ ఎస్ లో జరుగుతున్న ఈ వ్యవహారం ఎటువైపుకు దారితీస్తుందోనని పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. 

ఎన్నో ఎళ్లుగా టీడీపీలో కొనసాగిన కడియం శ్రీహరి - రాష్ట్ర విభజన తరువాత టీఆర్ ఎస్ లో జంప్ అయ్యారు. ప్రస్తుతం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య కూడా పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన పోటీపైనా సంధిగ్థత నెలకొంది.  ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈయనతో పాటు శిష్యురాలు సత్యవతి రాథోడ్ కూడా డోర్నకల్ నుంచి టిక్కెట్ కోరారట. ఆమెకు కూడా పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని అసంత‌ృప్తితో రగిలిపోతున్నారు.

ఈ క్రమంలో గురుశిష్యులు శ్రీహరి - సత్యవతి రాథోడ్ టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు బాగా ప్రచారం జరిగింది. ఆ తరువాత ఏమైందో ఏమో శ్రీహరి పార్టీ మారేది లేదని కరాఖండిగా చెప్పేశారు. తాను రాజకీయం చేస్తే టీఆర్ ఎస్ లోనే ఉండి చేస్తానని ప్రకటించారు. దాంతో తీవ్ర అంసతృప్తిలో ఉన్న సత్యవతి రాథోడ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అన్ని సిద్ధం చేసుకున్నాక గురువు రానని మొండికేయడం ఏమిటని దీర్ఘాలోచనలో పడిపోయారు.

ముందస్తు ఎన్నికలకు నగారా మొగించిన కేసీఆర్ - 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రెడ్యానాయక్ టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఈ సారి సత్యవతి రాథోడ్ కు కాకుండా, రెడ్యానాయక్ టీఆర్ ఎస్ అధిష్ఠానం పార్టీ టిక్కెట్ ప్రకటించింది. దీంతో సత్యవతి పార్టీ మారుతానని అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా ఈమెకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

ఇప్పటి వరకు సత్యవతి తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక రాజకీయ గురువు కడియం ఉన్నారు. ఆయన కారు దిగనంటున్నారు. ఈమెకు పార్టీ టిక్కెట్ దక్కలేదు.  ఈ క్రమంలో ఆమె పార్టీ మారాలా? గురువు మాట విని టీఆర్ ఎస్ లోనే కొనసాగి రెడ్యానాయక్ కు జై కొట్టలా? అనేది తేల్చుకోలేకపోతున్నారట. గురు శిష్యుల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరు ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
   

Tags:    

Similar News