తెలంగాణకు అన్నం.. ఆంధ్రకు సున్నం..!!?

Update: 2019-07-27 04:35 GMT
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకలి కేకలు వేయించడం ఖాయమని జలవనరుల నిపుణులు - ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రాజకీయ వర్గాలు ఘోషిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కాళేశ్వరంతో ఏపీకి ఎలాంటి నష్టమూ లేవని వాదిస్తున్నాయి. ప్రాజెక్టు డిజైన్ - దాని ఉద్దేశం - అది పనిచేసే తీరు అంతా లోతుగా పరిశీలించినవారు మాత్రం ఇది తెలంగాణకు అన్నం పెట్టడం ఎంత నిజమో... ఏపీకి సున్నం రాయడమూ అంతే నిజమని తేల్చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్నాళ్లకు ఏపీలో గోదావరి నది ఎడారిగా మారుతుందని.. గోదావరే ఎడారిగా మారితే అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ అనాథగా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. అందుకు.. లెక్కలు - ప్రాజెక్టులోని మతలబులు అన్నీ చూపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్తగా సాగునీరు అందుతుంది. ఇది ఆ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ... సంక్లిష్టమైన పద్ధతిలో పనిచేసే ఈ ప్రాజెక్టు వల్ల గోదావరిలో నీరు కిందకు రాకుండా చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. కారణం... కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక బ్యారేజో - ఆనకట్టో కాదు. అనేక బ్యారేజీలు - జలాశయాలకు ఫీడింగ్ సెంటర్. ఆ బ్యారేజీలు - ఆనకట్టలకు అనుబంధంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఎక్కడ ఏం నిర్మించుకున్నా - అనుమతుల్లేకున్నా పరిథి పొడిగించుకున్నా ఈ ఫీడింగ్ పెరుగుతుంది. ఫీడింగ్ ఇష్టారాజ్యంగా పెంచుకోవడం సాధ్యమా అన్న ప్రశ్న ఉదయించవచ్చు... కానీ, వాస్తవాలు చూస్తే దానికి సమాధానం దొరుకుతుంది. లెక్క ప్రకారం కాళేశ్వరం నుంచి 2 టీఎంసీలు ఎత్తిపోయాలి. కానీ.. ప్రాజెక్టు నిర్మాణంలో మరో టీఎంసీ ఎత్తిపోయడానికి కూడా అన్ని ఏర్పాట్లూ చేసి పెట్టారు. కేవలం మోటార్లు బిగిస్తే చాలు నీరు ఎత్తిపోయడానికి సర్వంసిద్ధం చేసిపెట్టారు. ఇది చాలు.. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి అంటున్నారు ప్రాజెక్టును అధ్యయనం చేసినవారు.

అసలేంటీ కాళేశ్వరం ప్రాజెక్టు?

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు - పంపు హౌజులు - కాలువ‌లు - సొరంగాల‌ స‌మాహారం. వీటన్నిటికీ ఒకదానితో ఒకటి లింకు ఉంటాయి. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఒకదాన్నుంచి మరో దానికి లింక్ చేస్తూ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌ లో ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వం రీడిజైన్ చేయించింది. ముందుగా అనుకున్న‌ట్టు ప్రాణ‌హిత న‌దిపై కాకుండా దిగువకు... గోదావరిలో ప్రాణ‌హిత క‌లిసిన త‌రువాత‌ ప్ర‌ధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు.

ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు - 19 పంపు హౌజులు - వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు - హైద‌రాబాద్‌ కు తాగునీరు - పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.

పాత ప్రాజెక్టులకూ నీరు..

శ్రీరాంసాగ‌ర్ - నిజాం సాగర్ - మిడ్ మానేరు - లోయ‌ర్ మానేరు - అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టుల‌ను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించారు. ఇందుకోసం కొత్త‌గా కాలువ‌లు - సొరంగాలు తవ్వాలు.. పంపు హౌజులు నిర్మించారు. వీటి ద్వారా మిగిలిన నీటిని త‌ర‌లించి ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తారు.

దీనికి అద‌నంగా - పాత ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్ర‌తిపాదించిన చోటే అప్ప‌టికంటే ఎత్తు త‌గ్గించి మ‌రో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్ - మంచిర్యాల జిల్లాల్లో 2 ల‌క్ష‌ల ఎక‌రాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.

ప్రాజెక్టులో భాగంగా గోదావ‌రిపై మూడు చోట్ల మేడిగ‌డ్డ‌ - సుందిళ్ల‌ - అన్నారం వద్ద బ్యారేజ్‌ లు క‌ట్టారు. ఒక బ్యారేజ్‌ లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మ‌రో బ్యారేజ్కు వ‌దిలేలా ఏర్పాటు ఉంటుంది. గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో - ఎగువ‌కి ఇలా మేడిగ‌డ్డ నుంచి ఎల్లంప‌ల్లి వ‌ర‌కూ నీటిని తెస్తారు. అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా నీటిని పంపిస్తారు. ఇలా నీరు సొరంగాలు - కాలువ‌ల్లో ప్ర‌వ‌హించి - పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోప‌ల‌ - బ‌య‌ట ప్ర‌యాణించి వేర్వేరు కొత్త - పాత జ‌లాశ‌యాలను క‌లుపుతూ ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కూ వ‌స్తుంది. ఇదంతా కాళేశ్వ‌రం లింక్ -1 లో జ‌రుగుతుంది.

ఇలా ఈ మొత్తం ప‌నిని లింకులుగా - తిరిగి ఆ లింకుల‌ను ప్యాకేజీలుగా విభ‌జించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి. లింక్ 1 - లింక్ 2 ల‌లో మేడిగ‌డ్డ‌ - అన్నారం - సుందిళ్ల బ్యారేజీలు - వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు - ధ‌ర్మారం - రామ‌డుగు గ్రామాల ద‌గ్గ‌ర్లో భూగ‌ర్భంలో నిర్మిస్తోన్న పంపుహౌజులు ఉంటాయి.

మొత్తంగా చూసుకుంటే కొత్తగా నిర్మించిన జలాశయాలు - బ్యారేజీలు - ఆనకట్టలు.. పాత జలాశయాలు.. ఇలా అన్నిటినీ లింక్ చేస్తూ కాళేశ్వరం నుంచి అన్నిటికీ నీరందించే బృహత్తర ప్లాను ఇది.

పాత ప్రాజెక్టులకు ఎగువ నుంచి నీటి చేరిక తక్కువ కావడంతో కాళేశ్వరం నుంచి పైకి నీరు పంపు చేయబోతున్నారు. అంటే.. దండకారణ్య ప్రవాహాల నుంచి వచ్చి చేరే నీటితో పొంగిపొర్లే గోదావరి జలాలు ఏపీలో అడుగుపెట్టడానికి ముందే భారీ పంపులతో వెనక్కు తోడుకునే ప్రణాళిక ఇది. అందుకే ఇదికచ్చితంగా ఏపీకి నష్టం కలిగిస్తుందని విమర్శకులు ఘోషిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు మొదలై శరవేగంగా పనులు జరిగినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడానికి.. ఏపీకి నష్టం కలగకుండా నివారించడానికి ఏమీ చేయలేకపోయింది. ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేనాటికి ప్రభుత్వం మారి జగన్ సీఎం అయ్యారు.


Full View

Tags:    

Similar News