కేసీఆర్‌ కు కాళేశ్వ‌రం క‌రెంట్ బిల్ షాక్‌..

Update: 2019-07-27 06:38 GMT
కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ ప్రాజెక్టును జూన్ 21న ప్రారంభించారు. ఇందులో మేడిగ‌డ్డ‌ - అన్నారం - సుందిళ్ల‌.. ఇలా ప‌లు బ్యారేజ్‌ - పంపుహౌస్‌ ల క‌ల‌బోతగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ప్ర‌పంచంలోనే ఇలాంటి ప్రాజెక్టు మ‌రెక్క‌డా క‌నిపించ‌ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఓ షాక్‌లాంటి వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే.. ఒక నెల వ్య‌వ‌ధిలోనే.. అదికూడా క‌న్నెప‌ల్లి పంపు హౌస్ వ‌ద్ద న‌డిచిన మూడు నాలుగు మోటార్ల బిల్లు సుమారు రూ.12 కోట్ల‌కు పైగా వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుకు నిద‌ర్శ‌న‌మ‌నే టాక్ వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం క‌న్నెప‌ల్లి పంపు హౌస్ వ‌ద్ద ఉన్న మొత్తం 17 మోటార్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు సుమారు ఆరు మోటార్ల వ‌ర‌కే న‌డుస్తున్నాయి. వీటికే ఒక నెల‌లో ఇంత బిల్లు వ‌స్తే.. మొత్తం మోటార్లు న‌డిస్తే.. ఎంతో బిల్లు వ‌స్తుంద‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతు బ‌ట్ట‌డం లేదు. అంతేగాకుండా.. అన్నారం వ‌ద్ద - సుందిళ్ల వ‌ద్ద‌ - ఆ త‌ర్వాత ఉన్న ప‌లు ప్యాకేజీల వ‌ద్ద న‌డిచే మోటార్ల‌తో ఏడాది సుమారు రూ.10,000 కోట్ల‌కు పైగా క‌రెంటు బిల్లు వ‌స్తుంద‌ని ప‌లువురు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. క‌న్నెప‌ల్లి వ‌ద్ద త‌క్కువ సామ‌ర్థ్యం ఉన్న మోటార్లు ఉన్నాయి. ఆ త‌ర్వాత ప‌లుప్యాకేజీల్లో వీటికి రెట్టింపు సామ‌ర్థ్యం ఉన్న మోటార్లు ఉన్నాయి. ఇవ్వ‌న్నీ న‌డిస్తే.. ఎంత క‌రెంటు బిల్లు వ‌స్తుందో ఊహించుకుంటేనే గుండె గుబేల్  మంటుంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో వ‌చ్చే ఫ‌లితం కంటే.. నిర్వ‌హ‌ణ భార‌మే అధికంగా ఉంటుందనే విమ‌ర్శ‌లు మొద‌టి నుంచీ ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కేవ‌లం మూడు నాలుగు మోటార్లు న‌డిస్తేనే.. నెల‌కు రూ.12 కోట్లకుపైగా బిల్లు వ‌స్తే.. ముందుముందు ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చున‌ని ప‌లువురు నిపుణులు అంటున్నారు. ఇప్ప‌టికే ట్రాన్స్ కో - జెన్‌ కోకు ప్ర‌భుత్వ విభాగాల‌కు సంబంధించి సుమారు వేల‌కోట్ల‌లో బకాయిలు ఉన్నాయి. వీటికి కాళేశ్వ‌రం బిల్లు తోడు అయితే.. అది మ‌రింత భారం అవుతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ బిల్లులు ఎలా చెల్లిస్తుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. బిల్లుల చెల్లింపుల్లో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. విద్యుత్ రంగం సంస్థ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు అంటున్నారు.
Tags:    

Similar News