తమిళ పాలిటిక్స్: కమల్-రజనీ కలయిక దిశగా..

Update: 2020-12-07 10:06 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖరారైన వేళ తమిళ పాలిటిక్స్ వేడెక్కాయి. ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ పోటీచేస్తే తమిళ రాజకీయాలే మారిపోతాయన్న చర్చ సాగుతోంది. అయితే బలమైన రజినీకాంత్ తో మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ కలిస్తే ఇక అధికారం వీరిద్దరిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం రజినీకాంత్ వర్గంతో కమల్ వర్గం సీనియర్ నేతలు రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. రజినీకాంత్ పార్టీ ప్రకటించినప్పటి నుంచే కమల్ పార్టీ నేతల్లో ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే పార్టీ పెట్టి ప్రభావం చూపని కమల్ ఇప్పుడు తన స్నేహితుడితో కలిసి పోటీచేస్తే ఇక మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే మక్కల్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అన్నాడీఎంకే కూటమి, డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడాడు. ఇప్పుడు కమల్‌హాసన్‌కు రజనీకాంత్‌ చేసిన ఆకస్మిక ప్రకటన కొండంత బలాన్ని ఇచ్చింది. రజినీకాంత్ పాత మిత్రుడు కావడంతో ఇతడి ఆహ్వానాన్ని తప్పక అంగీకరిస్తాడన్న నమ్మకం కమల్ లో ఉంది.

ఇదివరకే రజినీకాంత్ పార్టీ పెట్టినా.. పెట్టకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో అతడి మద్దతు కోరుతానని కమల్ హాసన్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రజినీ రాజకీయ ప్రకటన చేయడంతో ఇప్పుడు కమల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా అటు రజినీకాంత్, ఇటు కమల్ పోటీపడుతుండడంతో ఈ వ్యవహారం తేలేలా ఉండదని పొత్తుపై ప్రభావం పడొచ్చని అంటున్నారు. ఇక కమల్ నాస్తికవాది.. రజినీకాంత్ ఆధ్యాత్మిక వాది కావడంతో ఇరువురి అభిరుచులు కలుస్తాయా? లేదా అన్నది చూడాలి.
Tags:    

Similar News