'కాలా' తో జ‌త‌క‌డితే తిరుగుండ‌దు:క‌మ‌ల్

Update: 2018-08-01 10:52 GMT
మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌సకందాయంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే.  అమ్మ మ‌ర‌ణంతో రాష్ట్రంలో రాజ‌కీయ అస్థిర‌త ఏర్ప‌డడంతో....త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ లు రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ ``మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్``పేరుతో సొంత‌పార్టీని లాంచ్ చేశారు. ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ పేరు - విధివిధానాలు ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే, సినిమాల‌ ప‌రంగా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య పోటీ ఉన్న‌ట్లే....రాజ‌కీయాల‌లోనూ పోటీ ఉంటుందా? లేదా? అన్న సందేహాల‌ను చాలాకాలంగా వ్య‌క్తమ‌వుతున్నాయి. అయితే, క‌మ‌ల్ పార్టీతో క‌లయిక‌పై కాల‌మే స‌మాధాన‌మిస్తుంద‌ని `కాలా` ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. ఒక వేళ ర‌జ‌నీ పార్టీ రంగు కాషాయమైతే...తాను మ‌ద్ద‌తు తెల‌ప‌బోన‌ని క‌మ‌ల్ కూడా స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌మ‌ల్ ....తలైవాతో దోస్తీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ తామిద్ద‌రూ క‌లిసి రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే....త‌మ‌కు తిరుగుండ‌ద‌ని క‌మ‌ల్ అన్నారు.

సినిమాల్లో తాము మంచి స్నేహితుల‌మ‌ని...రాజ‌కీయాల ప‌రంగా సైద్ధాంతిక విభేదాలు మాత్ర‌మే  ఉన్నాయ‌ని....ర‌జ‌నీ త‌న‌కెప్పుడూ మిత్రుడేన‌ని క‌మ‌ల్ అన్నారు. అయితే, గ‌తంలో క‌మ‌ల్ - ర‌జ‌నీ క‌లిసి సినిమాల్లో న‌టించేవారు. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌మ ఇద్ద‌రి మార్కెట్ విస్త‌రించ‌డం లేదని, త‌మ మ‌ల్టీస్టారర్ సినిమాల‌ను నిర్మాత‌లు త‌మ‌కు అణుగుణంగా వాడుకుంటున్నార‌ని ఈ ఇద్ద‌రు స్టార్ లు భావించారు. అందుకే విడివిడిగా న‌టించి....త‌మ మార్కెట్ ప‌రిధిని పెంచుకుంటూ...స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను పెట్టి సినిమా తీయ‌డం నిర్మాత‌ల‌కు త‌ల‌కు మించిన భార‌మైంది. అయితే, ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వీరిద్ద‌రూ విడివిడిగా పోటీ చేసిన ప‌క్షంలో.....ఓట్లు చీలే అవ‌కాశ‌ముంది. అదే ఈ ఇద్ద‌రు స్టార్ లు జ‌త‌క‌డితే....క‌చ్చితంగా త‌మిళ రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News