రూ.30 కోట్లు తిరిగి ఇచ్చేస్తానంటున్న‌క‌మ‌ల్‌

Update: 2017-11-16 11:16 GMT
ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా గ‌తంలోనే చెప్పారు క‌మ‌ల్ హాస‌న్‌. పార్టీ పేరును.. దానికి సంబంధించిన విష‌యాల్ని చెబుతాన‌న్న క‌మ‌ల్‌.. పార్టీ కోసం అభిమానుల నుంచి తాను సేక‌రించిన రూ.30 కోట్ల‌ను తిరిగి ఇచ్చేస్తాన‌ని చెబుతున్నారు.

పార్టీ పెట్ట‌టానికి అభిమానుల నుంచి రూ.30 కోట్లు సేక‌రించిన‌ట్లు గ‌తంలో క‌మ‌ల్ వెల్ల‌డించారు. ఈ మ‌ధ్య‌న త‌మిళ మ్యాగ‌జైన్‌కు అర్టిక‌ల్స్ రాస్తున్న క‌మ‌ల్‌.. త‌న తాజా ఆర్టిక‌ల్ లో తాను సేక‌రించిన రూ.30 కోట్ల విష‌యాన్ని చెప్పారు. ఎలాంటి మౌలిక స‌దుపాయాలు లేకుండా అభిమానుల నుంచి సేక‌రించిన రూ.30 కోట్ల‌ను తిరిగి ఇచ్చేయాల‌ని తాను భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

అంత‌మాత్రాన తాను వెన‌క్కి త‌గ్గిన‌ట్లు ఎంత మాత్రం కాద‌ని.. ఏం చేయ‌కుండా డ‌బ్బు దాచుకోవ‌టం నేర‌మ‌వుతుంద‌ని చెప్పారు. త‌న పార్టీ పేరు ఇంకా పెట్ట‌లేద‌ని.. అందుకే విరాళాలు తిరిగి ఇచ్చేద్దామ‌నుకున్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. డ‌బ్బులు తిరిగి ఇచ్చేయ‌టం అంటే త‌న రాజ‌కీయ ఎంట్రీ విష‌యంలో వెన‌క్కి వెళ్ల‌టం ఎంత మాత్రం కాదంటూ క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్‌..  ఇటీవ‌ల వివాదంగా మారిన త‌న హిందూ వ్యాఖ్య‌ల‌పై మ‌రింత క్లారిటీ ఇచ్చారు.

హిందూ జ‌నాభా ఎక్కువ‌గా ఉంద‌ని.. హిందువులు అన్న‌ల్లాంటి వార‌ని.. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్నందున మైనార్టీల‌ను అక్కున చేర్చుకోవాల‌న్నారు. వారు చేసే త‌ప్పుల్ని స‌రిదిద్దాల‌ని.. హిందువుల‌కు పెద్ద మ‌నసు ఉండాల‌ని త‌న తాజా ఆర్టిక‌ల్ లో పేర్కొన్నారు. ఏమైనా సేక‌రించిన కోట్లాది రూపాయిల మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల‌నుకోవ‌టం చిన్న విష‌యం కాద‌ని చెప్పాలి. తాను సేక‌రించిన విరాళాల్ని వెన‌క్కి ఇచ్చేయ‌టం ద్వారా ఇక‌పై తాను విరాళాలు సేక‌రించ‌న‌న్న విష‌యాన్ని చెప్ప‌టం విశేషం. రాజ‌కీయ పార్టీ పెడుతూ ఫండ్ సేక‌రించ‌న‌ని చెప్ప‌టం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం. కానీ.. తాను చెప్పిన మాట మీద ఎంత‌మేర నిల‌బ‌డ‌తారో చూడాలి.
Tags:    

Similar News