సింగిల్ ట్వీట్‌ తో క‌మ‌ల్ క‌ల‌క‌లం పుట్టించారే!

Update: 2017-07-19 09:43 GMT
ద‌క్షిణాది చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లోకెక్కాడు. ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి చిన్న విష‌యంపై స్పందిస్తున్న క‌మ‌ల్‌... తాను హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన త‌మిళ వెర్ష‌న్ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంపై పెద్ద దుమారం రేగ‌గా... ఆయ‌న కూడా త‌న‌పై విరుచుకుపడుతున్న వారిపై అంతే స్థాయిలో సెటైర్లేస్తున్నారు. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాట నెల‌కొన్న రాజ‌కీయ శూన్య‌త‌ను పార‌దోలాలంటే... ఇప్పుడు ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉన్న వారు కాకుండా మ‌రొక‌రు ఎంట్రీ ఇవ్వాల్సిందేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో ఎప్ప‌టినుంచో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తార‌ని ప్ర‌చారం సాగిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై నిన్న‌టిదాకా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా త‌ప్పించుకుంటున్న ర‌జ‌నీ... అటు తన అభిమానుల‌తో పాటు త‌మిళ ప్ర‌జ‌ల‌ను స‌తాయిస్తున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ వంతు వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవ‌రో ఈ ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాల్సిన అవ‌స‌రం లేకుండా... కమ‌లే ఈ ప్ర‌చారానికి శ్రీకారం చుట్టిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్‌ పై రేకెత్తిన వివాదాన్ని ఆస‌రా చేసుకుని త‌న‌దైన స్టైల్లో కామెంట్లు చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్‌... ఇప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసిన ఓ సింగిల్ ట్వీట్ తో పెను క‌ల‌క‌ల‌మే రేపారు.

క‌మ‌ల్ చేసిన ట్వీట్ వివ‌రాల్లోకెళితే... 11 లైన్ల‌తో ఉన్న ఓ క‌విత‌ను ఆయ‌న ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేశారు. దాని అర్థం ఇలా ఉంది. *ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని. లొంగి ఉండటానికి నేను బానిసను కాను. కిరీటాన్ని వదిలిపెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నాతో పాటు రండి కామ్రేడ్... అసంబద్ధతను బద్దలు గొట్టే నాయకుడిగా తయారవుతారు* అనే అర్థం వ‌చ్చేలా ఓ త‌మిళ క‌విత‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. ఈ క‌విత త‌మిళ‌నాట పెను క‌ల‌క‌ల‌మే రేపింది. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించేందుకు ర‌జ‌నీ వెన‌క‌డుగు వేస్తుండ‌గా, ర‌జ‌నీతో స‌మ‌కాలికుడుగా ఉన్న క‌మ‌ల్ హాస‌న్ ఆయ‌న‌కంటే ముందుగానే రాజకీయాల్లోకి వ‌చ్చేస్తున్నార‌ని ఈ ట్విట్‌ ను బ‌ట్టి అర్థ‌మైపోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

కమల్ ను ఉద్దేశించి ఇటీవ‌ల‌ మాట్లాడిన‌ తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్... దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలను కమల్ సీరియస్ గా తీసుకున్నారా? ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమల్ కు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ఆయన అన్నారు. మొత్తానికి సింగిల్ ట్వీట్ ద్వారానే క‌మ‌ల్ త‌మిళ రాజ‌కీయాల్లో వేడి పుట్టించార‌న్న వాద‌న మొద‌లైపోయింది.
Tags:    

Similar News