కమలానికి కమల్ నాథ్ రివర్స్ షాక్ మామూలుగా లేదు కదా!

Update: 2019-07-25 07:25 GMT
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కుప్పకూలి బీజేపీ సర్కారు ఏర్పడుతున్న నేపథ్యంలో కాషాయ పార్టీ నెక్స్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశ్ - రాజస్థాన్ ప్రభుత్వాలేనన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే... రాజస్థాన్ సంగతి పక్కన పెడితే మధ్యప్రదేశ్‌ లో మాత్రం బీజేపీకి ఊహించని షాకిచ్చారు అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిప్పుకుని తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ట్రై చేసే అవకాశమున్న బీజేపీ కంటే ఒకడుగు ముందుకేసి తానే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ లోకి లాక్కొచ్చారు. అంతేకాదు... ఓ బిల్లు విషయంలో ఓటింగ్ నిర్వహించిన అందులో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించేలా చేసి బలపరీక్షకు సెమీ ఫైనలా అన్నట్లుగా చేసి అందులో విజయం సాధించారు. దీంతో బీజేపీ మధ్య ప్రదేశ్ విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌ లో కమల్‌ నాథ్ ప్రభుత్వం బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ - శరద్ కౌల్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కమల్‌ నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరించిన బీజేపీకి స్వయంగా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినట్లైంది. క్రిమినల్ లా సవరణ  బిల్లు విషయంలో బుధవారం అసెంబ్లీలో ఓటింగ్ జరిగినపుడు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి - కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ లో ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించుతామన్న ఆ పార్టీకి షాక్ తగిలింది.

క్రిమినల్ లా సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ దీనిపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దాంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ దానికి 122 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు స్పీకర్‌ ది. కాగా...  బీజేపీ ఓటింగులో పాల్గొనకపోవడంతో విపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు.

మరోవైపు సీఎం కమల్ నాథ్ ఇప్పటికే ‘దమ్ముంటే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాలి’ అని బీజేపీకి సవాలు విసిరారు. తన సత్తా చూపించడానికే అన్నట్లుగా  అసెంబ్లీలో క్రిమినల్ లా సవరణ బిల్లు ప్రవేశపెట్టినపుడు దానిపై ఓటింగ్ జరిగేలా చేశారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 114 స్థానాలు లభిస్తే - బీజేపీకి 108 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీఎస్పీకి ఇద్దరు - సమాజ్‌ వాదీ పార్టీకి ఒకరు - నలుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వారి డిమాండ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. వీరిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు మంత్రిమండలిలో చోటు కూడా దక్కింది.

నిన్నటి ఓటింగులో కాంగ్రెస్ పార్టీకి 122 ఓట్లు రాగా.. అందులో ఒకటి స్పీకరుది. మరో రెండు బీజేపీ ఎమ్మెల్యేలవి. 114 మంది సభ్యుల సొంత బలం.. ఇతరులు అయిదుగురు మద్దతుతో 119 మంది సభ్యుల బలంతో ఉన్న కమలనాథ్ ప్రభుత్వం ఇప్పుడు బలం 122కి పెంచుకోవడంతో ఆ ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ మరింత కష్టం కానుంది.
Tags:    

Similar News