హరిబాబు లాంటోళ్లే ఏపీకి అసలైన శత్రువులా?

Update: 2015-09-26 04:53 GMT
సొంత ప్రాంత ప్రయోజనం కంటే కూడా పార్టీ విధానాలకే పెద్దపీట వేయటం ఏపీ నేతలకు అలవాటే. ఈ ఒక్క కారణమే రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ప్రయోజనాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఏపీ విభజన సమయంలో ప్రాంత ప్రయోజనాల కంటే కూడా.. తమ విధేయతను.. మరి ఇతర కారణాల మీద మాత్రమే దృష్టి సారించిన నేతల పుణ్యమా అని ఏపీకి ఎంత నష్టం వాటిల్లాలో అంత నష్టం వాటిల్లింది.

విభజన తర్వాత కూడా ఇదే తంతు నడుస్తోంది. విభజన కారణంగా ఏపీ ఎంత నష్టపోయిందని కథలు.. కథలుగా చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన నేతల్లో బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు ఒకరు. ఇలాంటి ఆయన మాటలు ఇప్పుడు భిన్నంగా ఉంటున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని ప్రశ్నించటం సంగతి తర్వాత.. కేంద్రం అడుగులకు మడుగులు వత్తేలా.. వారి వాదనకు తమదైన భాష్యం చెప్పే నేతల్లో హరిబాబు ఒకరు.

తాజాగా ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై తనదైన శైలిలో వాదనను వినిపించారు. ప్రత్యేక హోదా ఒక్కటే సరిపోదని.. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేసి మిగిలినవి ఏమీ ఇవ్వకుంటే ఏం చేస్తామని తెలివిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మాట కానీ వినకుంటే..ఏపీకి ఏమీ చేయదన్న విషయాన్ని చెబుతున్నారు. హరిబాబు మాటలు.. కేంద్రం మైండ్ సెట్ కు అనుగుణంగా సీమాంధ్రుల్ని సిద్ధం చేసేలా ఉండటం గమనార్హం.

రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలు.. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసే హరిబాబు లాంటి నేతలే ఏపీకి అసలుసిసలైన శత్రువులుగా పలువురు అభివర్ణిస్తున్నారు. హరిబాబు మాటల్ని విని.. కేంద్రం చెప్పినట్లు తలూపితే ఎలాంటి సమస్యా ఉండదని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవన్నట్లు ఆయన మాటలు ఉండటం గమనార్హం. హరిబాబు చెబుతున్న మాటలు చూస్తే.. ప్రత్యేక హోదా సంగతి వదిలేసి.. కేంద్రం విదిల్చే ప్యాకేజీ ముష్టికి సిద్ధం కండన్న విషయాన్ని ఆయన సూటిగానే చెప్పేస్తున్నారు.
Tags:    

Similar News