కాషాయబంధం పచ్చగా ఉండాలనే ఆయన కోర్కె!

Update: 2018-02-21 06:13 GMT
తెలుగుదేశం - భాజపా పార్టీలు ఒకరి పట్ల ఒకరు నిత్యం విమర్శలు చేసుకుంటూ.. సిగపట్ల కాపురం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఒక్క మంత్రి గారు మాత్రం ఈ రెండు పార్టీల అనుబంధం చాలా పటిష్టంగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ పార్టీల మైత్రి కలకాలం కొనసాగాలనేదే ఆయన ఉద్దేశం. నిజానికి భాజపాలోని చాలా మంది నాయకులకు - మోడీ పుణ్యమాని.. రాష్ట్రంలో కూడా తమ పార్టీ బలం అనూహ్యంగా పెరిగిపోయిందని, తెదేపాకు కటీఫ్ చెప్పేస్తే.. తమ దారి తాము చూసుకుని సొంతంగా ఎదగవచ్చుననే ఆలోచన బలంగా ఉంది. అయితే ఒక్క మంత్రి మాత్రం.. రెండు పార్టీల బంధం వల్లనే ఏపీ ప్రగతి సాధ్యమవుతోందని అంటున్నారు. పనిలో పనిగా.. జగన్ కమలంతో జట్టుకట్టే ఛాన్సు ఉండదన్నట్లుగా జగన్ ని కూడా సూటిపోటి మాటలంటున్నారు. ఆ మంత్రి కామినేని శ్రీనివాస్!

ఇన్నాళ్లూ తెదేపా వాళ్లు జగన్ -భాజపా కుమ్మక్కు గురించి ప్రస్తావించాల్సి వస్తే.. ‘జగన్ ను బీజేపీ విమర్శిచడం లేదే’ అంటుండేవాళ్లు. ఆ కొరతను తీర్చడానికా అన్నట్లు కామినేని జగన్ మీద విమర్శలు సంధించారు. నీతికి ప్రతినిధి మోడీ అయితే.. అవినీతికి ప్రతినిధి జగన్ అని.. వీరి బంధం ఏర్పడదని తాను అనుకుంటున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో తెదేపా-భాజపా కలిసే పోటీచేస్తాయని ముందే జోస్యం చెబుతున్న కామినేని.. పచ్చబంధం తెగిపోగూడదని కోరుకునే వారిలో ముందుంటారనేది అందరూ ఎరిగిన సంగతే.

నిజానికి తెలుగుదేశంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న భాజపా మంత్రిగా ఆయనకు పేరుంది. బంధం కటీఫ్ అయితే.. ముందుగా ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది కూడా ఆయనకే అని బహుళ ప్రచారంలో ఉంది. అలాంటి మంత్రిగారు ‘ఈ బంధం దృఢమైనది’ అని తాజాగా కితాబు ఇస్తూ... బంధం తెగకుండా ఉండేందుకు తన వంతు సాంత్వన వచనాలు పలుకుతూ.. జగన్ కు ఎంట్రీ ఉండకుండా ఉండేలా ఆయన అవినీతిపరుడని వ్యూహాత్మక నిందలు వేస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.

మొన్నటికి మొన్న మరో  భాజపా మంత్రి మాణిక్యాల రావు.. తెగతెంపులకు తయార్ అంటూనే.. తెదేపాను దూరం చేసుకునే పరిస్థితి ప్రస్తుతానికి భాజపాకు లేదని చెప్పారు. ఇవాళేమో మరో మంత్రి కామినేని.. మా బంధం దృఢంగానే ఉంది.. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ అంటున్నారు. మొత్తానికి భాజపా మంత్రులు తెగబోతున్న బంధాన్ని గట్టిగానే ముడివేయడానికి చూస్తున్నట్లుంది.
Tags:    

Similar News