కనకమేడల అత్యుత్సాహం..వెంకయ్య షాకిచ్చారు

Update: 2020-02-05 14:27 GMT
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ ప్రస్తావిస్తూ స్వైర విహారం చేస్తున్న విపక్ష తెలుగు దేశం పార్టీకి పార్లమెంటులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాకుండా టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు జగన్ పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపునకు గురయ్యాయి. ఇదంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో ఈ వ్యవహారం జరిగింది. అంతేకాదండోయ్... సదరు టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను అసందర్భ వ్యాఖ్యలుగా ప్రకటించేసిన వెంకయ్య... సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్వయంగా చెప్పడం గమనార్హం.

బుధవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు, వాటిపై కొనసాగుతున్న దర్యాప్తులపై చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. నిత్యం జగన్ కేసులపై మాట్లాడుతున్నట్లుగానే... అది రాజ్యసభలో జరుగుతున్న చర్చ అన్న విషయం కూడా మరిచిపోయిన కనకమేడల... ఏపీ సీఎం జగన్ పై నమోదైన 11 కేసులను ప్రస్తావించారు. జగన్ పై 11 కేసులున్నాయని, కోర్టు విచారణకు కూడా హాజరుకాలేనని జగన్ పిటిషన్ వేశారని కూడా కనకమేడల తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయారు. అంతటితో ఆగకుండా జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

రాజ్యసభ చర్చలో పాటించాల్సిన నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా కనకమేడల... అవకాశం చిక్కింది కదా అని రాజ్యసభలో జగన్ పేరును, ఆయనపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూనే... ఈ కేసుల విచారణను త్వరిగతిన పూర్తి చేయాలంటూ కోరడంతో సభ్యులంతా షాక్ తినగా... క్షణాల్లో తేరుకున్న వెంకయ్య... కనడకమేడలకు బ్రేక్ వేశారు. కనకమేడల ప్రసంగాన్ని కట్ చేసిన వెంకయ్య... రాష్ట్రం పేరు కాని, ముఖ్యమంత్రి పేరు కాని సభలో ప్రస్తావించవద్దని చెప్పారు. కేవలం ఈ అంశం వరకే చర్చ జరగాలని సూచించారు. అంతేకాకుండా కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా వెంకయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Tags:    

Similar News