సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న బెజ‌వాడ పోలీసులు

Update: 2017-10-25 12:32 GMT
లేనిపోని త‌ల‌నొప్పుల్ని భ‌రించ‌టం ఒక ఎత్తు. అలాంటి వాటి విష‌యంలో ముంచుకొచ్చే ముప్పును గుర్తించి తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌టం మ‌రో ప‌ద్ధ‌తి. తాజాగా బెజ‌వాడ పోలీసులు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం లేకుండా ఇద్ద‌రి విష‌యంలోనూ ఒకేతీరులో వ్య‌వ‌హ‌రించి తాము ఎవ‌రి ఒత్తిడికి లొంగేది లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.

ఆర్య‌వైశ్యుల్ని చిన్న‌బుచ్చేలా పుస్తకం రాసిన కంచె ఐల‌య్య తీరుకు నిర‌స‌న‌గా ఆర్య‌వైశ్యులు ర్యాలీ నిర్వ‌హించాల‌ని భావిస్తూ.. ఐల‌య్య‌ను అభిమానించే వారు ఆయ‌న‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ రెండింటికి ఈ నెల 28న ముహుర్తంగా ఫిక్స్ చేశారు.

తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు అవ‌కాశం ఉన్న ఈ రెండు కార్య‌క్ర‌మాల విష‌యంలో పోలీసులు ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న దానిపై తీవ్ర ఉత్కంట నెల‌కొంది. అయితే.. ఈ రెండు ప్రోగ్రామ్స్ విష‌యంలో పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  రెండు కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకున్న బెజ‌వాడ పోలీసులు.. రేప‌టి (గురువారం) నుంచి విజ‌య‌వాడ న‌గ‌రంలో 144వ సెక్ష‌న్ అమ‌ల్లో ఉంద‌ని పేర్కొన్నారు.

త‌మ స‌న్మాన కార్య‌క్ర‌మానికి ఐల‌య్య స‌న్మాన నిర్వాహ‌కులు అనుమ‌తి కోర‌గా.. ఐల‌య్య‌పై నిర‌స‌న ర్యాలీకి త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆర్య‌వైశ్యులు కోరారు. పోటాపోటీగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి ఇస్తే త‌లెత్తే ప‌రిస్థితుల్ని గుర్తించిన పోలీసులు ఇరువ‌ర్గాల వారికి అనుమ‌తి నిరాక‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.
Tags:    

Similar News