రాజధాని పై కన్నాకు క్లారిటీ వచ్చేసింది.. ఏం మాట్లాడారో తెలుసా?

Update: 2020-01-06 06:04 GMT
వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం.. చేసిన తప్పు తెలుసుకొని చప్పున నాలుక కర్చుకుంటూ దిద్దుబాటు మాటలు మాట్లాడేసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి పనే చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుల వారు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ రాజధాని విషయంలో జగన్ సర్కారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా కన్నా వారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడి అనవసరమైన కన్ఫ్యూజన్ కు తెర తీశారు. రాజధాని విషయం లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాల్ని మర్చిపోయిన ఆయన.. కేంద్రాన్ని ముగ్గు లోకి లాగే ప్రయత్నం చేశారు.

తాజాగా తాను చేసిన తప్పుల్ని తెలుసుకున్నరో.. తెలిసి వచ్చేలా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన నోటి వెంట వచ్చిన మాట మారింది. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని.. ఆ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని రివర్స్ గేర్ లో మాట్లాడారు. మొన్నటి వరకూ తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్రం తనంతట తానుగా ఎలాంటి జోక్యం చేసుకోదన్నారు. ఏపీ రాజధానుల విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం ఉండదన్న మాటతో పాటు.. ఇది బీజేపీ తరఫున తాను చేస్తున్న అధికార ప్రకటనగా జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కన్నా తాజా మాటలు ఉండటం గమనార్హం.

జీవీఎల్ వ్యాఖ్యల్ని మీడియా ప్రస్తావించినప్పుడు.. తాను కూడా అందుకు భిన్నంగా ఏమీ మాట్లాడటం లేదుగా అని కన్నా పేర్కొన్నారు. గతంలో తాను చెప్పిన మాటల్ని మీడియానే భిన్నంగా అర్థం చేసుకుందని ఆయన సెలవిచ్చారు. ఏపీ రాజధానులపై తాను చేసిన వ్యాఖ్యల్లోని తప్పుల్ని కన్నా గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే దిద్దుబాటు ధోరణిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.


Tags:    

Similar News