కన్నా గారూ... తిరుపతిలో దీక్షకు పిలుస్తున్నారండీ!

Update: 2019-12-27 13:55 GMT
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా... రాజధాని చర్చే. చంద్రబాబు సర్కారు రాజధానిగా ఎంపిక చేసిన అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేస్తూ... ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు, జ్యుడిషియల్ కేపిటల్ ను కర్నూలుకు తరలించే దిశగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు వడివడిగానే అడుగులు వేస్తోంది. జగన్ యత్నాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్దగా వ్యవతిరేకత రాకున్నా... రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమదైన శైలిలో నిరసనలకు దిగుతున్నారు. వారికి మద్దతుగా అంటూ ఇటు టీడీపీతో పాటు అటు బీజేపీ కూడా అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు తాము వ్యతిరేకమంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా అమరావతిలో శుక్రవారం ఒక్కరోజు మౌన దీక్షకు దిగారు. ఈ దీక్షను కూడా అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలోనే ఆయన చేపట్టారు.

ఈ దీక్ష ఇతర ప్రాంతాల వారిని ఏమో గానీ... రాయలసీమ వాసులను మాత్రం ఆగ్రహానికి గురి చేసిందని చెప్పాలి. కన్నా దీక్షకు దిగారన్న విషయం తెలియగానే భగ్గుమన్న రాయలసీమ వాసులు... గతంలో 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీకి నరేంద్ర మోదీ చేసిన హామీలను గుర్తు చేసుకుని కన్నాకు ఓ స్ట్రాంగ్ ఇన్విటేషన్ ను పంపారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కాంక్షిస్తూ తమరు చేపట్టిన దీక్ష బాగానే ఉంది... దానికి మేము కూడా మద్దతు పలుకుతాం... ముందుగా మీరు ఓ సారి తిరుపతి వచ్చి మోదీ ఇచ్చిన హామీల అమలు కోసం మరో రోజు మౌన దీక్ష చేపట్టాలని ఈ ఆహ్వానంలో సీమ వాసులు కన్నాకు ఇన్విటేషన్ పంపారు. అంతేకాకుండా నాడు ఏపీకి ఏమేం చేస్తామన్న విషయాన్ని చెబుతూ మోదీ పలికిన పలుకులను కూడా వారు గుర్తు చేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీని తలదన్నేలా ఏపీకి రాజధానిని నిర్మిస్తామని చెప్పిన మోదీ... ఏపీని అన్ని రకాలుగా ఆదుకునే క్రమంలో ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కూడా చెప్పుకొచ్చారు. ఈ మాటలను మోదీ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పక్కన కూర్చోబెట్టుకుని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సీమ వాసులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా... రాజధానిపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే... నాడు మోదీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయాన్నింటినీ గుదిగుచ్చి... కన్నాకు గుర్తు చేస్తూ... నాటి మోదీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో దీక్ష చేద్దాం రమ్మంటూ సీమ వాసులు ఆయనకు ఆహ్వానం పంపారు. మరి కన్నా సీమ వాసుల కోరికను తీరుస్తారో, లేదో చూడాలి.
Tags:    

Similar News