బాబు ఉలిక్కిప‌డే కామెంట్ చేసిన క‌న్నా

Update: 2018-06-24 04:11 GMT
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విరుచుకుప‌డ‌ట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యాంగా పెట్టుకున్న క‌న్నా ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు - విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు పాల‌న అవినీతిమ‌య‌మ‌ని క‌న్నా ఆరోపించారు. వివిధ పథకాల అమలులో భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. చంద్రబాబు అవినీతిని ఆధారాలతోసహా నిరూపిస్తానని ప్ర‌క‌టించారు. అన్నింటా అవినీతికి పాల్పడుతున్న ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. చంద్రబాబు అవినీతిని నిరూపించకపోతే తనను జైలులో పెట్టాలని కన్నా సవాల్ విసిరారు.

టీడీపీ నాయకులు ప్రజలను తప్పుదోవపట్టించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని క‌న్నా ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి విభజన హామీలను పదేళ్ల‌ వరకు అమలుచేయవచ్చని, అయితే కేంద్రం ఇప్పటికే 80 శాతం హామీలను నెరవేర్చిందని కన్నా తెలిపారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు కేంద్రం నిధులతో రాష్ట్రం సోకు చేసుకుంటున్నదని విమర్శించారు.‘సాంకేతిక కారణాలతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వీలు పడదని సెయిల్‌ ప్రకటించింది. దీనిపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకెళ్తుంటే టీడీపీ ఎంపీలు నిరాహార దీక్షలు చేయడమేమిటి? ఇదంతా చంద్రబాబు పన్నాగమే. ఆయన తన అవినీతి - అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని - బీజేపీ నాయకులను దోషులుగా చూపించే కుట్ర పన్నుతున్నారు. రైల్వే జోన్‌ - దుగరాజపట్నం పోర్టుపైనా కేంద్రం సానుకూలంగా ఉంది. దుగరాజపట్నం పోర్టుకు ఇస్రో సాంకేతిక కారణాలతో అభ్యంతరాలు చెప్పింది. దానికి ప్రత్యామ్నాయం చూపకుండా చంద్రబాబు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.

ఇదిలాఉండ‌గా...నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నామ‌ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని 100% నిధులు కేటాయిస్తోందని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌కటించారు. పోలవరం ప్రాజెక్ట్ కు శరవేగంగా కావాల్సిన అనుమతులను - నిధులను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై పోలవరం నిర్మాణం చేయడం బీజేపీ సర్కార్ ప్రధమ ప్రాధాన్యమ‌న్నారు.
Tags:    

Similar News