మోడీ సూటుపై సిబల్‌ సెటైర్లు బాగున్నాయి కానీ...

Update: 2015-03-17 04:29 GMT
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ ధరించిన ఖరీదైనసూటు అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడప్పుడే వదిలిపెట్టేటట్లు లేదు. ఎన్నికల ముందు తనను తాను ఛాయ్‌వాలా చెప్పుకొన్న మోడీ ఎన్నికల తర్వాత ఇలా లక్షల రూపాయల విలువైన సూట్లు ధరిస్తుండటాన్ని అడ్డం పెట్టుకొని ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి  ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఆ వ్యవహారాన్ని కెళుకుతోంది.

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మోడీ సూటును అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పై మాటల దాడి చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత సూటుగా గొడవను వదిలించుకోవడానికి మోడీ అండ్‌ కంపెనీ కూడా వేలం ఎత్తుగడను అనుసరించింది.

    అయితే.. ఇప్పుడు ఆ వేలం తీరుపై కాంగ్రెస్‌ పార్టీ రచ్చ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి కపిల్‌ సిబల్‌ మోడీ సూటు అంశంపై తాజాగా సెటైర్లు వేశాడు.

    గాంధీ మహాత్ముడి వస్తువులు, అబ్రహం లింకన్‌ అపురూపమైన వస్తువుల కంటే మోడీ సూటే ఎక్కువ విలువ చేసింది చూశారా.. అంటూ కపిల్‌ ఎద్దేవా చేశాడు. ఇదేదో బాగుందంటూ.. కేంద్ర ఖజానాను నింపడానికి తరచూ ఇలాంటి వేలాలు నిర్వహించాలని సిబల్‌ చురక వేశాడు.

    ఇలా తరచూ మోడీ వస్తువులను వేలం వేస్తూ కోట్ల రూపాయలను ఖజానాకు జమ చేస్తుంటే.. వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరత తీరుతుందని సిబల్‌ వ్యంగ్యసూచనను చేశాడు.

    మరి ఈ సెటైర్లు అయితే బాగానే ఉన్నాయి కానీ.. ఇప్పటికే మోడీ సూటు వ్యవహారం పాత బడింది. కాంగ్రెస్‌ మరో పాయింట్‌ను టేకప్‌ చేస్తే మేలేమో!
Tags:    

Similar News