పవన్‌ కల్యాణ్‌ తీరుపై గుర్రుమన్న కాపు నేతలు!

Update: 2016-08-31 09:16 GMT
''నాకు కులం ఏమిటి.. నాకు కులాన్ని అంటగడుతున్నారు. నాకు కులం లేదు - ప్రాంతం లేదు - మతం లేదు..'' అంటూ తిరుపతిలో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ ఆవేశంగా ప్రసంగించినప్పుడు ఆయన అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. కానీ ఆ వ్యాఖ్యలు కాపు కుల పెద్దలకు మాత్రం ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తనకు కులమే అక్కర్లేదు, తనకు కులమే లేదు అంటూ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడడం సబబు కాదని కాపు ఉద్యమ నాయకులు ఆయన తీరు మీద గుర్రుగా ఉన్నారుట. కాపు ఉద్యమం గురించి డిసైడ్‌ చేయడానికి హైదరాబాదులో రెండురోజులుగా ఆ కులానికి చెందిన పెద్దలను కలుస్తున్న ముద్రగడ పద్మనాభంతో సంభాషణల్లో ఈ భావాలు వ్యక్తం అవుతున్నాయిట.

కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజమండ్రిలో సెప్టెంబరు 11న కుల నాయకులందరితో ముద్రగడ పద్మనాభం ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కాస్త విభిన్నంగా దాసరి వంటి వాళ్లందరి దగ్గరకు వచ్చి వారిని తాను స్వయంగా ఆహ్వానించి, వారందరి మద్దతును కూడా కూడగట్టుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే హైదరాబాదులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని కాపు పెద్దలు - దాసరి - చిరంజీవి తదితరులతో సమావేశం అయ్యారు.

ఈ భేటీలోనే పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. తనకు కులం లేదు - మతం లేదు.. నన్ను ఒక కులానికి పరిమితం చేస్తారా అంటూ మాట్లాడడం పవన్‌కు తగదని కాపునేతలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కావలిస్తే.. కులాలకు అతీతంగా ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అని ఆయన పిలుపు ఇచ్చి ఉండచ్చునని, దాన్ని అందరూ సమర్థించి ఉండేవాళ్లమని అన్నారుట. మొత్తానికి పవన్‌ తనను విశ్వమానవుడిగా ఎస్టాబ్లిష్‌ చేసుకోవాలనుకుంటున్న ప్రయత్నం ఆయన సామాజిక వర్గానికి కోపం తెప్పించినట్లుందని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News