బాబు..కేసీఆర్‌ ను చూసి నేర్చుకోమంటున్న కాపులు

Update: 2017-07-25 04:57 GMT
కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే ఉద్య‌మం ఏపీలో హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 26 తేదీ నుంచి కాపు రిజ‌ర్వేష‌న్ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఛ‌లో అమరావ‌తి పేరుతో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సాగ‌కుండా పోలీసులు చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు గడియలు సమీపించే కొద్దీ తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణం ఉద్విగ్నంగా మారుతోంది. ఇప్పటికే జిల్లా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణం ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసులు కదంతొక్కుతున్నారు. ఆరువేలమంది పోలీసుల్ని జిల్లాలో మోహరించారు. మరో 2500 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్‌ బలగంలో దాదాపు సగానికి పైగా ఈ జిల్లాలోనే విధుల్లో ఉన్నారు. వీరికి తోడు సోమవారం రాత్రి సిఆర్‌ పిఎఫ్‌ బలగాలు బరిలొకి దిగాయి. ఎపిఎస్‌ పి - ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ బలగాల్ని కూడా మోహరించారు. అత్యాధునిక డ్రోన్‌ కెమెరాల‌తో జిల్లాలో అంగుళం అంగుళాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే 400మందికిపైగా కాపు నేతలపై బైండోవర్‌ కేసులెట్టారు. వారి ఇళ్ల‌ చుట్టూ పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.

తూర్పు గోదావ‌రిలోని ఈ వాతావ‌ర‌ణం చూసిన కాపు నేత‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను చూసి పరిపాల‌న, ప్ర‌జా ఉద్య‌మాల‌ను గౌర‌వించే తీరును ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ‌లో పెద్ద ఎత్తున పాద‌యాత్ర‌లు - బ‌స్సుయాత్ర‌లు సాగిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇలా అణిచివేసిన దాఖ‌లాలు లేవ‌ని అంటున్నారు. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం రాష్ట్రవ్యాప్తంగా పాద‌యాత్ర చేసి కేసీఆర్ స‌ర్కారుపై దుమ్మెత్తిపోసిన‌ప్ప‌టికీ టీఆర్ ఎస్ శ్రేణులు ఎక్క‌డా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం అయితే ఏకంగా కేసీఆర్ ల‌క్ష్యంగానే ముందుకు సాగారు. అమ‌రుల స్పూర్తియాత్ర పేరుతో పర్య‌టించిన కోదండ‌రాం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్‌ లో, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లలో బ‌స్సుయాత్ర నిర్వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ ఈ యాత్ర‌ల‌పై ఇటు టీఆర్ఎస్ శ్రేణుల రూపంలో కానీ అటు ప్ర‌భుత్వం ద్వారా కానీ ఎలాంటి ఇక్క‌ట్లు ఎదురుకాలేదు. ఒక‌నాడు ఉద్య‌మంలో త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన వ్య‌క్తి త‌న ఇలాకాలోనే ఇలా విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ కేసీఆర్ స‌ర్కారు త‌న ప‌ని త‌న‌ది...వారి ప‌ని వారిది అన్న‌ట్లుగా ముందుకు సాగారు.

ఏపీలో మాత్రం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ఎన్నిక‌ల హామీని నిలుపుకోవ‌డం విష‌యంలో చేస్తున్న పాద‌యాత్ర‌ను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ప్ర‌జాస్వామ్యయుతంగా చేప‌ట్టిన పాదయాత్ర‌ను ఆరంభ స్థాయిలోనే పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తూ నిలిపివేయ‌డం గురించి పాల‌కులు స‌మీక్షించుకోవాల‌ని అంటున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం పోరాటాన్ని అణివేస్తున్న తీరు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్తున్నారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో వెయ్యిమంది పోలీసు బలగాల్ని మోహరించారు. గ్రామానికెళ్ళే అన్ని రహదార్లను దిగ్భంధనం చేసారు. ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అటు వైపుఅనుమతిస్తున్నారు. ఇంటి చిరునామాగల దృవీకరణ పత్రం చూపిన వార్ని మాత్రమే ఆ మార్గంలో వెళ్ళేందుకు వదులుతున్నారు. ముద్రగడ ఇంటి చుట్టూ సుమారు 250మంది పోలీసుల్ని కాపలా పెట్టారు. వీరితో పాటు నిఘా వర్గాలు కూడా అక్కడ మోహరించాయి. ఏ ఒక్కర్నీ ముద్రగడను కలిసేందుకు అనుమతించడంలేదు. పక్కనున్న స్టోరేజ్‌ ప్లాంట్‌ లో కూడా 200మంది పోలీసులు కాపలా ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టేశారు. ఇంటింటికి తిరిగి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 140 మందికి నోటీసు లిచ్చారు. 86 మందిపై బైండోవర్‌ కేసు లెట్టారు. ఆదేశాల్ని ధిక్కరించి పాద యాత్రకు అడుగులేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Tags:    

Similar News