కాపు నేత‌లు మ‌రోసారి

Update: 2022-02-04 09:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు కాపు సామాజిక‌వ‌ర్గం సిద్ధ‌మ‌వుతోంది. ఇన్ని రోజులు వివిధ పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిల‌చిన ఆ వ‌ర్గం నేత‌లు ఇప్పుడు సొంతంగా త‌మ‌కంటూ ఓ వేదిక ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే రెండు సార్లు స‌మావేశ‌మైన కాపు ముఖ్య నేతలు.. ఈ నెల రెండోవారంలో మ‌రోసారి భేఠీ కాబోతున్నారు. ఈ ప్ర‌త్యేక స‌మావేశంలో త‌మ భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై ఓ నిర్ణ‌యానికి వస్తార‌ని తెలిసింది. వివిధ పార్టీల్లో ఉన్న రాజ‌కీయ నేత‌ల‌తో పాటు మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్‌, ఏపీఎస్ అధికారులు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన‌నున్నారు.

ఏపీ రాజ‌కీయాల్లో కాపు సామాజిక‌వ‌ర్గం అత్య‌ధికంగా ఉంది. అధికారం ఎవ‌రికి ద‌క్కాలో నిర్ణ‌యించే ప‌ట్టు వాళ్ల‌కుంది. కానీ వాళ్ల‌లో ఐక్య‌త లేక‌పోవ‌డం వ‌ల్లే రాజ్యాధికారం ద‌క్క‌డం లేద‌నే అభిప్రాయాలున్నాయి. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం, ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేనలు కూడా కాపు సామాజిక‌వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేయ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని కాపు నేత‌లు భావిస్తున్నారు.  ఆ ల‌క్ష్యంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస‌రావుతో పాటు బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ త‌దిత‌రులు ఒక్క‌తాటిపైకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

వీళ్ల‌తో పాటు వివిధ పార్టీల‌కు చెందిన కాపు నేత‌లు ఇప్ప‌టికే స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై స‌మావేశాలు జ‌రిపారు. అన్ని పార్టీల్లో ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం నేత‌ల అభిప్రాయాలను తీసుకుని ప్ర‌స్తుతం ఉన్న పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఒక వేదిక‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు రాజ్యాధికారం దిశ‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలిసింది.

మ‌రోవైపు విజ‌య‌వాడ జిల్లాకు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌ని కూడా ఈ స‌మావేశం వేదిక‌గా డిమాండ్ చేస్తార‌ని  తెలిసింది. ఈ స‌మావేశం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారే అవ‌కాశం ఉంది. ఇన్ని రోజులు కాపుల‌పై ఆధార‌ప‌డ్డ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తాయో అనే ఆసక్తి నెల‌కొంది.



Tags:    

Similar News