బాబు స్పెషల్‌ ఆరెంజ్ మెంట్ 'కాపు రిజర్వేషన్‌'..??

Update: 2017-12-03 10:26 GMT
'ది హిందు' దినపత్రికలో ప్రచురితమైన చంద్రబాబును అభినందిస్తున్న కాపు నాయకుల చిత్రాన్ని పరిశీలిస్తే ఆయన రాజకీయం తీరుకు అద్ధం పడుతుంది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో కాపు నాయకులు ఆయనను కలిసి అభినందిస్తున్న సందర్భమిది. ఇంతవరకు బాగానే ఉంది. ఈతరహా పనులను దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అందరు ముఖ్యమంత్రులు చేస్తూనే ఉంటారు. కానీ చంద్రబాబు వ్యవహారశైలి మాత్రం ప్రత్యేకమైనది. హిందూ పత్రిక ప్రచురించిన చిత్రానికి కింద రాసిన రైటప్‌లో 'స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌' అని ఉండటం మనం గమనించవచ్చు. ఇక్కడ స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ అంటే ఆ చిత్రాన్ని హిందూ ఫొటోగ్రాఫర్‌ తీసింది కాదు వేరొకరు తీస్తే తాము (హిందూ) వాడుకున్నామనేది దాని అర్థం. అదే విషయం చంద్రబాబు కూడా అక్షరాలా నప్పుతుంది. రాజకీయాల్లో ఆయనవన్నీ స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ గానే ఉంటాయి. కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ కమిషన్‌ అధికారికంగా నివేదిక సమర్పించకపోయినప్పటికీ ఆ నివేదిక ఆధారంగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి సిఫార్సు చేసిన వెంటనే కాపు సామాజిక వర్గం నాయకులు కొందరు (ఆ పార్టీకి చెందినవారే) వెంటనే ముఖ్యమంత్రిని పుష్పగుచ్ఛంతో కలిసి అభినందించారు. ఇదంతా స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ మాత్రమే అనేది చంద్రబాబు రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారికి స్పష్టంగా అర్థమవుతుంది. హిందూ రైటప్‌ లో పేర్కొన్న స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ పదాలు ఇక్కడ ఈయనికి సరిగా నప్పాయి.
  
మంజునాథ కమిషన్‌ నివేదిక అధికారికంగా సమర్పించలేదు. ఆ నివేదికను కమిషన్‌ రూపొందించింది. అధికారికంగా కమిషన్‌ చైర్మన్‌ లేదా కార్యదర్శి వెళ్లి సమర్పించాలి. ఇవేవీ లేకుండానే కమిషన్‌ లోని ముగ్గురు సభ్యులు తమంతట  తాముగా నివేదికను ముఖ్యమంత్రికి శాసనసభ ముగియటానికి ఒక రోజు ముందు సమర్పించారు. ఇదంతా రాజకీయ కోణంతో వ్యూహాత్మకంగా జరిగినట్లే కనిపిస్తోంది. సంఘ చైర్మన్‌ లేదా కార్యదర్శి లేకుండా సభ్యులు నివేదిక సమర్పించటానికి వచ్చినా కూడా ముఖ్యమంత్రి వారిని నివారించాలి. కమిషన్‌ కు కనీస గౌరవం - విలువ ఇవ్వాలి. ఇవేమీ ఆయన ఇవ్వకుండా తొందరపడ్డారు. ఆ వెనువెంటనే కేంద్రానికి ఐదు శాతం కోటాను సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో అఖిలపక్ష సమావేశాలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో చర్చించి ఆ తరువాత శాసనసభలోని అన్ని పక్షాలూ సమగ్రంగా చర్చించిన తరువాత కేంద్రానికి సిఫార్సు చేయటం ముఖ్యం. ఈ అంశం ఓ వైపు వివాదం - మరోవైపు సున్నితం - ఇంకో వైపు ఓ వర్గం డిమాండ్‌ తో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరీ ప్రధానంగా ముఖ్యమంత్రి అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకుని కేంద్రానికి ప్రతిపాదించాలి. కానీ ఇంత రాజనీతిజ్ఞత చంద్రబాబులో ఎక్కడా కనిపించలేదు. కేవలం రాజకీయ వ్యూహంతోనే ఆయన పనిచేశారు. దీనిని అక్షరాలా స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ అని పేర్కొనటంలో తప్పుండదు.
    
కాపులను బీసీలలో చేర్చాలిన డిమాండ్‌ చాలా కాలంగా ఉన్నా గతంలో ముద్రగడ పద్మనాభం ఆందోళన సాగించినప్పుడు అప్పటి విజయభాస్కర్‌ రెడ్డి ప్రభుత్వం హడావుడిగా జీఓ ఇచ్చినప్పటికీ అది చెల్లుబాటు కాలేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని వేరే వర్గం వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల హామీల్లో పేర్కొన్నారు. దానిని అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం ఆందోళన చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం మంజునాథ కమిషన్‌ ను నియమించింది. ఈ కమిషన్‌ సిఫార్సులు అధికారికంగా వెల్లడి కానప్పటికీ సభ్యులు ప్రభుత్వానికి సమర్పించటంతో వివరాలు వెల్లడయ్యాయి. ఈ అంశాన్ని పూర్తిగా - తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు వ్యూహాత్మకంగా చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు స్పష్టంగా అవగతమవుతోంది.
 
కాపురిజర్వేష్లు ముందుకు రావటానికి పోలవరం కీలకమైనది. ఈ నేపథ్యంలోనే పోలవరం సమస్య ముందుకు వచ్చింది. అందులో బాబు ఇరుక్కుపోతారు. నిజానికి పోలవరం తీవ్రమైన సమస్య. ఈ ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో 2018 నాటికి పూర్తి చేయాలని నిబంధనలు చెబుతున్నా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కైన తరహాలో ప్రాజెక్టుకు మంగళం పాడుతున్నారు. తాజాగా 60సీ నిబంధన కింద తొలగించిన పనులకు మళ్లీ టెండర్‌ పిలవగా ఆ టెండర్‌ అమలును ఆపివేయాలంటూ కేంద్రం రాష్ట్రానికి లేఖరాసింది. ఇది వివాదంగా మారటంతో చంద్రబాబు ఆవేశానికి లోనై బీజేపీపై పరోక్షంగా మోదీపై శాసనసభలో అక్కసు వెళ్లగక్కారు. దాంతో బీజేపీ - టీడీపీల మధ్య తెగదెంపులు ఖాయమనే అభిప్రాయం కనిపించింది. దీనినుంచి బయట పడేందుకు బాబు వెంటనే కాపు రిజర్వేషన్ల అంశాన్ని స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ తరహాలో తెరమీదకు తెచ్చారు. ఫలితంగా పోలవరం అంశం తాత్కాలికంగా తెరమరుగయ్యింది. పోలవరం అంశం అదే విధంగా రగులుకుని చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చేవి. తద్వారా రాష్ట్రానికి లాభమో - నష్టమో దాపరికం లేకుండా వెలుగుచూసేవి. అది జరిగితే తనకు - బీజేపీకి కూడా నష్టమని చంద్రబాబు భావించారు. అందుకనే వెంటనే కాపు రిజర్వేషన్లు తెరమీదకు వచ్చేశాయి. నిజానికి కాపు రిజర్వేషన్లు ఓవైపు సున్నితం - మరోవైపు వివాదాస్పదమైన అంశం. రిజర్వేషన్లు కావాలని కాపులు కోరుతుంటే వారికి వద్దంటూ బీసీ గళమెత్తుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో బీసీల కన్నా కాపుల ఓట్లు చంద్రబాబుకు చాలా ముఖ్యం. అందుకని కాపుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించుకునేందుకు ఆ వర్గం వారికి మరింతగా దగ్గరయ్యేందుకు ఈ ప్రత్యేక ఏర్పాటును అకస్మాత్తుగా రంగం మీదకు తీసుకువచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకత్వాలు స్పష్టంగా ఉన్నాయి. 50 శాతం మించి ఎక్కువ రిజర్వేషన్లు కల్పించటం వీలు కాదు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం కాపులను 10వ షెడ్యూల్‌ లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయించారు. ఇది అంత సులువైనది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ముస్లింలకు - దళితులకు ఏబీసీ వర్గీకరణలు వివాదాస్పదమై ఇప్పటికీ తేలలేదు. తరచూ కేంద్రంపై ఒత్తిడి చేస్తూ కాలం గడపటం మినహా ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. కాపుల విషయంలోనూ అదే జరుగుతుంది. అయితే తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం నిర్ణయం తీసుకుంటే అమలవుతుందని చెప్పి తప్పించుకోవటానికి చంద్రబాబుకు ఈ స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి రిజర్వేషన్లు సాధ్యంకావు. ఏదైతేనేమి పోలవరం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా టీడీపీ - బీజేపీ తగాదా పడకుండా ఈ అంశం అకస్మాత్తుగా తెరమీదకు వచ్చింది. ఈ విధమైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ఒక సమస్య నుంచి దాటుకుంటూ మరో సమస్యను సృష్టించి తాను మాత్రం రాజకీయంగా లబ్ధిపొందటం నేటితరం పాలకులకు కొత్తేమీ కాకపోయినా అందులో చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుంటారు.
   
ఇంత లోపభూయిష్టంగా ఆయన వేస్తున్న ఎత్తుగడలు - వ్యూహాలు ప్రజల ముందు కళ్లకు కట్టినట్లు వివరించలేకపోవటంతో ప్రధాన ప్రతిపక్ష వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం - వైసీపీ - బీజేపీ పార్టీలు ప్రధానమైనవి. కమ్యూనిస్టుల పాత్ర పరిమితంగా మారిపోయింది. జనసేన పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసం గడుపుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్షపాత్రను సమర్థంగా నిర్వహించాల్సిన జగన్‌ పాదయాత్ర పేరుతో పూర్తిగా అస్త్రసన్యాసం చేసినట్లు కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడి చేతులు కాల్చుకున్న వైసీపీ-జగన్‌ లు ఆ సమస్య నుంచి బయటపడి పార్టీని పటిష్టపరుచుకునేందుకు పాదయాత్ర చేస్తుండటం పార్టీకి ప్రయోజనం అయినప్పటికీ, రాష్ట్రానికి సంబంధించి రెండు ప్రధాన అంశాలు పోలవరం - కాపు రిజర్వేషన్లతో పాటు వర్తమాన అంశాలలో జగన్‌ - వైసీపీలకు సరైన గొంతులేకుండా పోయింది. ఫలితంగా స్పెషల్‌ అరేంజ్‌ మెంట్‌ రాజకీయాలు ప్రస్తుతానికి అయితే బిగుసుకుపోతున్నాయి.

------ఎస్ . వి. రావు
Tags:    

Similar News