కర్నాట‌క కేబినెట్‌ లో ఆ క్యాస్ట్‌ దే డామినేష‌న్‌!

Update: 2019-08-21 01:30 GMT
కర్ణాటక మంత్రివర్గంలో ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప త‌న సొంత సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌పీఠ వేసుకున్న‌ట్టు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మంత్రివర్గంలో లింగాయత్ కులానికి పెద్దపీట వేసి 8 మంత్రి పదవులు ఇచ్చారు. ఒక్కలిగ (గౌడ)కు మూడు మంత్రి పదవులు కేటాయించారు. ఆయ‌న కులాలు - జిల్లాల వారీగా లెక్క‌లు వేసుకున్నా త‌న కులానికే పెద్ద ప్రయార్టీ వేసుకోవ‌డంతో అప్పుడే అసంతృప్త జ్వాల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే కరావళి - పాత మైసూరు జిల్లాల వారికి మొండి చెయ్యి మిగిలింది.

త‌న తాజా కేబినెట్‌ ను య‌డియూర‌ప్ప మొత్తం 17 మందితో ఏర్పాటు చేశారు. వీరిలో ముఖ్య‌మంత్రిగా ఉన్న య‌డియూర‌ప్ప లింగాయ‌త్ వ‌ర్గానికి చెందిన వారు. వీరితో త‌న సామాజిక‌వ‌ర్గానికే చెందిన‌ మరో 7 మందికి మంత్రులుగా స్థానం కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ - లక్ష్మణ సవది - వి. సోమణ్ణ - బసవరాజ్ బోమ్మయ్ - సీసీ పాటిల్ - శశికళ జోల్లే - జేసీ  - మధుస్వామికి మంత్రి పదవులు దక్కాయి. మొత్తం మంత్రి వ‌ర్గంలో 50 శాతానికి కాస్త త‌క్కువుగా 44 శాతం మంది లింగాయ‌త్‌ ల‌కు ప‌ద‌వులు ద‌క్కాయి. ట్విస్ట్ ఏంటంటే హైద‌రాబాద్ క‌ర్నాట‌క ప్రాంతానికి చెందిన ఒక్క లింగాయ‌త్ ఎమ్మెల్యే కు కూడా య‌డ్డీ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా య‌డియూర‌ప్ప‌కు తెలియకుండానే మంత్రి వ‌ర్గ జాబితాను ఏర్పాటు చేసి బెంగ‌ళూరుకు పంపిన‌ట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో అవకాశం దక్కిని ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంత్రి వ‌ర్గం ఏర్పాటు చేసినా సీఎం కూడా త‌న వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వులు ఇప్పించుకోలేక‌పోయాన‌న్న అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక దేవ‌గౌడ వ‌ర్గం అయిన వ‌క్క‌లిగ (గౌడ‌) వ‌ర్గం నుంచి ముగ్గురుకి మంత్రి ప‌ద‌వులు వ‌చ్చాయి. వీరిలో బెంగళూరు నగరంలోని పద్మనాభనగర ఎమ్మెల్యే ఆర్. అశోక్ - మల్లేశ్వరం ఎమ్మెల్యే డాక్టర్ ఆశ్వథ్ నారాయణ - చిక్కమగళూరు ఎమ్మెల్యే సీటీ. రవి మంత్రుల‌య్యారు. రెండు ప‌ద‌వులు ద‌ళితుల‌కు ఇవ్వ‌గా... కురుబ కులం నుంచి కేఎస్. ఈశ్వరప్ప - వాల్మీకి వర్గానికి చెందిన బళ్లారి శ్రీరాములు (మెళ‌కాళ్మూర్ ఎమ్మెల్యే) - బ్రాహ్మ‌ణ వ‌ర్గం నుంచి బెంగళూరులోని రాజాజీనగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ - బిల్లద కులానికి చెందిన కోటా శ్రీనివాస పూజారి - లంబాణి వర్గానికి చెందిన ప్రభు చౌహాన్ లకు మంత్రి పదవులు దక్కాయి.
Tags:    

Similar News