కొత్త వివాదంలో కుమార..ఓటేస్తేనే సాయం చేస్తారట!

Update: 2019-06-26 14:45 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి - జేడీఎస్ కీలక నేత హెచ్ డీ కుమారస్వామి... నిత్యం వివాదాల్లోనే ఉంటున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీకి కూడా క్లియర్ మెజారిటీ రాని నేపథ్యంలో కింగ్ మేకర్ అవుతారనుకున్న కుమార... ఏకంగా కింగే అయిపోయారు. అప్పటి నుంచి కుమార ఏదో ఒక వివాదంలోనే ఉంటున్నారు. సంకీర్ణ కేబినెట్ లోని కాంగ్రెస్ మంత్రులు కుమారకు చుక్కలు చూపిస్తూ ఉంటే... ఎప్పుడెప్పుడు కుమారను దించేసిన తాను గద్దెనెక్కుదామా? అంటూ బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప కాసుక్కూర్చుని ఉన్నారు. మొత్తంగా కుమార పరిస్థితి ముందు నుయ్యి - వెనుక గొయ్యి మాదిరి తయారైంది. అయినా కూడా ఓ రేంజిలో పాలన సాగిస్తూనే వస్తున్న కుమార... ఎప్పటికప్పుడు తనను తానే వివాదాల్లో పడేసుకుంటున్నారు. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

ప్రస్తుతం పల్లె నిద్ర పేరిట గ్రామాల్లో లగ్జరీ బస చేస్తూ సాగుతున్న కుమార... సమస్యలున్నాయని తన వద్దకు వచ్చిన ప్రజలపై అంతెత్తున లేచారు. అంతేకాదండోయ్... తనకు ఓటు వేయకుండా తన వద్దకు సాయం కోసం ఎలా వస్తారంటూ ఆయన ప్రజలనే నిలదీసేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీకి దక్కిన ఘోర పరాభవాన్ని తలచుకున్నారో - ఏమో తెలియదు గానీ.... ఎన్నికల్లో మోదీకి ఓటేసి సాయం కోసం తన వద్దకు వస్తారా? అంటూ ఆయన ప్రజలపై ఒంటికాలిపై లేచారు. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూర్ పరిసరాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన విజువల్స్ మీడియాకు చిక్కడంతో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలో కుమార ఊగిపోయిన తీరు వైరల్ గా మారిపోయింది.

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే... పల్లె నిద్రలో భాగంగా రాయచూర్ నుంచి కర్రెగుడ్డకు వెళుతున్న కుమార బస్సును అక్కడి స్థానికులు అడ్డగించారు. తమ సమస్యలను పట్టించుకున్న వారే లేరంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కుమార.. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన జనంపై చిందులు తొక్కారు. ఎన్నికల్లో మోదీకి ఓటేసి సాయం కోసం మాత్రం తన వద్దకు వస్తారా? అంటూ ఆయన శివాలెత్తారు. సీఎంగా ఉన్నా కాబట్టి కాస్తంత సహనంగా ఉన్నానని, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదంటూ కూడా ఆయన కాస్తంత బెదిరింపు ధోరణిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జనం కుమార బెదిరింపులను ఏమాత్రం లెక్కచేయకపోగా... పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన పోలీసులు రంగంలోకి దిగడంతో కుమార అక్కడి నుంచి బయలుదేరగలిగారు. మొత్తంగా తనకు ఓటేస్తేనే సాయం చేస్తానని చెప్పి ప్రజలపై తనదైన శైలి బెదిరింపులకు దిగిన కుమార వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగానే మారిపోయాయి.
Tags:    

Similar News