యాక్సిడెంట్ అయితే ట్రీట్‌ మెంట్ ఫ్రీ

Update: 2016-03-09 04:42 GMT
క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రికొత్త ప‌థకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయ‌ప‌డిన వారు చికిత్స కోసం ఆస్ప‌త్రుల చుట్టూ తిర‌గ‌డం వారు నిబంధ‌న‌ల పేరుతో అడ్డగీత వేయ‌డం వంటి త‌ల‌నొప్పులు ఎదురుకాకుండా ముఖ్య‌మంత్రి సాంత్వ‌న హ‌రీశ్‌ యోజ‌న పేరుతో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ప్ర‌కారం యాక్సిడెంట్ అయిన‌ మొద‌టి 48 గంట‌ల్లో ఏ ఆస్ప‌త్రిలో అయినా చికిత్స పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ ప‌థ‌కాన్ని సీఎం సిద్ధ‌రామ‌య్య ప్రారంభించారు. ఈ ప‌థ‌కం తీసుకురావ‌డం వెనుక‌, అందులో హ‌రీశ్ అనే వ్య‌క్తి పేరును జోడించ‌డానికి గ‌ల కార‌ణాన్ని రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి యూటీ ఖ‌దీర్ ఆస‌క్తిక‌రంగా వివ‌రించారు.

హ‌రీశ్ నాజ‌ప్ప అనే వ్య‌క్తి రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ప్ప‌టికీ త‌న‌ను ర‌క్షించే వారికి క‌ళ్ల‌ను దానం చేసేలా చూడాల‌ని కోరారు. ఆయ‌న మాన‌వ‌త్వానికి గుర్తింపునిచ్చేందుకు కొత్త ప‌థ‌కంలో ఆయ‌న పేరు జోడించారు. ఈ ప‌థ‌కాన్ని తీసుకురావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఖ‌దీర్ వివ‌రిస్తూ...రోడ్డు ప్ర‌మాదంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్‌ లు జ‌రుగుతున్న‌ప్పటికీ బాధితుల‌కు వైద్య‌స‌హాయం అందించేందుకు స‌వాల‌క్ష నిబంధ‌న‌లు అడ్డువ‌స్తున్నాయ‌ని చెప్పారు. పోలీసులు వేసే ప్ర‌శ్న‌లు - ఆస్ప‌త్రుల్లో అయ్యే వైద్యం ఖ‌ర్చు వంటివి రోడ్డు ప్ర‌మాద బాధితుల‌ను ఆదుకునేందుకు ఎవ్వ‌రూ ముందుకురాక‌పోవ‌డానికి కార‌ణంగా మారాయ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో క్ష‌త‌గ్రాత్రుల‌కు ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చి వైద్యం అందించేందుకు కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు.

ఈ ప‌థ‌కం ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేందుకు ఇప్ప‌టికే అన్ని ఆస్ప‌త్రుల‌కు ఆదేశాలు ఇవ్వ‌డ‌మే కాకుండా ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారు సంప్ర‌దించేలా టోల్ ఫ్రీ నంబ‌ర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్ప‌టికే రూ.10 కోట్లు ఈ ప‌థ‌కం కోసం విడుద‌ల చేశామ‌ని పేర్కొంటూ దీంతో పాటు రూ.75 కోట్లు బ‌డ్జెట్‌ లో పొందుప‌రిచిన‌ట్లు క‌ర్ణాట‌క ర‌వాణ మంత్రి ఖ‌దీర్ వివ‌రించారు.
Tags:    

Similar News