కన్నడ నాట కొత్త ప్రచారం..ప్రెసిడెంట్ రూలేనట!

Update: 2019-07-25 14:42 GMT
మొన్నటిదాకా ట్విస్టులకే ట్విస్టులను చూపించిన కర్ణాటక రాజకీయం... ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్న తరుణంలో మరో పిడుగు లాంటి వార్త ఆ రాష్ట్ర ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. కన్నడ నాట తాజా రాజకీయ పరిణామాలను చాలా నిశితంగానే గమనిస్తూ సాగుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు... కన్నడ నాట రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు ఒక్క కన్నడిగులనే కాకుండా యావత్తు దేశ ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాజకీయ పరంగా నిత్యం సంక్షోభాలతోనే సాగుతున్న కన్నడ నాట ఇప్పుడు కొత్తగా రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

నిన్నటిదాకా కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఆధ్వర్యంలోని కుమారస్వామి సర్కారును కుప్పకూల్సేసి కర్ణాటక సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ చాలా యత్నాలే చేసింది. ఈ క్రమంలో సంకీర్ణ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో ఈ నాటకం బాగానే రక్తి కట్టింది. చివరకు మొన్ బలపరీక్షలో ఓడిన కుమార సీఎం పదవికి రాజీనామా చేయగా... ఆ సీటును ఎప్పుడెప్పుడు దక్కించుకుందామా? అన్నట్లుగా వేచి చూసిన బీజేపీ నేత - మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప... బీజేపీ అధిష్ఠానం పెద్దల సూచనతో గవర్నర్ ను కలవకుండానే అలా ఉండిపోయారు. అయినా యడ్డీ ఆసక్తిపై నీళ్లు చల్లిన బీజేపీ అధిష్ఠానం ఏం ప్లాన్ రచిస్తోందన్న విశ్లేషణలు సాగుతుండగానే... కన్నడనాట రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

ఈ తరహా ప్లాన్ కు బీజేపీ అధిష్ఠానం ఎందుకు రూపకల్పన చేసిందన్న విషయానికి వస్తే.... కుమార సర్కారును కూల్చేందుకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ జాప్యం చేస్తూ వస్తున్నారు. వారి రాజీనామాలను ఆమోదిస్తే.... వెనువెంటనే యడ్డీ సీఎం సీట్లో కూర్చోవచ్చు. అలా కాకుండా రాజీనామాలను స్పీకర్ ఆమోదించకుండానే యడ్డీ సీఎం కుర్చీలో కూర్చుంటే... ఒకవేళ కాంగ్రెస్ పార్టీనో - జేడీఎస్సో కోర్టును ఆశ్రయించి యడ్డీ బలపరీక్షకు డిమాండ్ చేస్తే... కుమారకు పట్టిన గతే యడ్డీకి కూడా తప్పదు. ఎందుకంటే... 16 మంది కూటమి - ఇద్దరు స్వతంత్రుల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే... ఒకవేళ బలపరీక్ష జరిగినా.. మేజిక్ ఫిగర్ 103కు పడిపోతుంది. ఇప్పటికే 105 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అలా కాకుండా ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించకుండానే యడ్డీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత బల పరీక్ష ఎదురైతే... అప్పుడు మేజిక్ ఫిగర్ 112 అవుతుంది. 105 మంది సొంత బలం - ఇద్దరు స్వంతంత్రుల మద్దతు కలిసి 107 మంది బలం కలిగిన బీజేపీ 112 మంది బలాన్ని చూపడం దుస్సాధ్యమే. అంటే... ఎన్నికలు ముగిసిన తర్వాత ఎదురైన పరాభవమే యడ్డీకి మరోమారు తప్పదు. ఈ లెక్కలు వేసుకున్న తర్వాతే బీజేపీ అధిష్ఠానం స్పీకర్ నిర్ణయం తేలేదాకా అయినా కర్ణాటకలో రాష్ట్రపతి పాలనను విధించాలని చూస్తోందట. దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్న బీజేపీ నేతలు... ఎటువెళితే - ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న విషయంపై తర్జనభర్జన పడుతోందట. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేని నేపథ్యంలో తన నయా ప్లాన్ లో భాగంగా కర్ణాటకలో స్వల్ప కాలం వరకైనా రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ యోచిస్తోందట.



Tags:    

Similar News