కాంగ్రెస్ నేతల కంటే కేసీఆర్ కే విలువిచ్చిన కర్ణాటక

Update: 2016-05-15 04:51 GMT
ఒకే పార్టీకి చెందిన వారి మధ్య అనుబంధం ఎక్కువని చెబుతారు. కానీ.. అలాంటివి కాంగ్రెస్ లాంటి పార్టీలో ఉండవని మరోసారి స్పష్టమైంది. జాతీయ పార్టీగా చెప్పుకునే ఈ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో పవర్ లో ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో విపక్షంగా ఉంది. తమ రాష్ట్ర అవసరాల కోసం సానుకూలంగా స్పందించమని పక్క రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోరితే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుంది? తమ పార్టీకి చెందిన పక్క రాష్ట్ర నేతల మాటకు ఎంత విలువ ఇస్తుంది? వారి వినతిపై ఎలాంటి స్పందన ఉంటుందన్న ప్రశ్నలకు తాజాగా సమాధానం లభించటమే కాదు.. షాక్ తినేలా పరిణామం చోటు చేసుకుంది. విపక్షంగా తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితికి తగ్గట్లే.. సొంత పార్టీకి చెందిన వారు సైతం తమ మాటల్ని ఖాతరు చేయటం లేదన్న బాధతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఉదంతం ఒకటి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తాజాగా ఎదురైంది.

నీటి కటకట ఎక్కువగా ఉన్నతమ ప్రాంతానికి ఎగువన ఉన్న రాష్ట్రాన్ని ఒప్పించి వారి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించే కష్టమైన బాధ్యత సహజంగా అధికారపక్షం తీసుకుంటుంది. తెలంగాణ అధికారపక్షం కూడా ఇలానే రియాక్ట్ అయ్యింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించిన మంత్రి హరీశ్ రావు.. నారాయణపూర్ నుంచి మూడు టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలి కోరారు.

తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి తమకు అవసరమైన తాగునీటిని తీసుకొచ్చేందుకు తెలంగాణ అధికారపక్షానికి పోటీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. తెలంగాణ మంత్రి హరీశ్ కోరిన మూడు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీని జత చేసి.. నారాయణపూర్ కు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని.. తమ వినతిపై సానుకూలంగా స్పందించాలంటూ కర్ణాటకకు వెళ్లి మరీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారు. కర్ణాటకలో తమ పార్టీనే అధికారపక్షంగా ఉన్న నేపథ్యంలో తమ వినతికి సానుకూలంగా స్పందిస్తే.. ఆ మైలేజీ తాము సొంతం చేసుకోవచ్చిన ఆశించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి కావటం గమనార్హం.

ఆసక్తికరంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల వినతిని తుంగలో తొక్కిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు.. తెలంగాణ మంత్రి హరీశ్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించింది. మూడు టీఎంసీల నీరుకాకుండా ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. అంతేకాదు.. కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయటానికి కారణం మంత్రి హరీశ్ చేసిన ప్రయత్నాలే అని కృష్ణా జల భాగ్య నిగమ మేనేజింగ్ డైరెక్టర్ కురాసిన లేఖలో కర్ణాటక జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొనటం గమనార్హం. సొంత పార్టీ నేతలకు క్రెడిట్ ఇవ్వని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు.. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ప్రస్తావిస్తూ.. అందుకే తాము నీటిని విడుదల చేస్తున్నామంటూ నోట్ రాయటం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాకివ్వటం కాయం.

ఎగువన ఉన్న కర్ణాటకను పలు సందర్భాల్లో ఏపీ ప్రభుత్వాలు నీటిని విడుదల చేయాలని కోరటం మామూలే. ఏపీ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం పట్టించుకునేది కాదు. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా మంత్రి హరీశ్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించిన ఒక టీఎంసీ నీటిని విడుదల చేయటం చూస్తే.. సొంత పార్టీ నేతల్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రభావితం చేయటం లేదన్న విషయం స్పష్టం కావటం ఖాయం. ఇంతకంటే అవమానం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంకేం ఉంటుంది..?
Tags:    

Similar News