సొంతోళ్ల‌కు షాక్ తినిపించిన క‌ర్ణిసేన అతి

Update: 2018-01-25 06:01 GMT
అవ‌స‌రానికి మించిన హ‌డావుడి చేయ‌టంలో క‌ర్ణిసేన ముందు ఉంటుంద‌న్న విష‌యం తాజాగా తేలిపోయింది. కొంత‌కాలంగా ప‌ద్మావ‌త్ (గ‌తంలో ప‌ద్మావ‌తి) చిత్రానికి సంబంధించి వారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో చ‌రిత్ర‌ను త‌ప్పుదారి ప‌ట్టించ‌ట‌మే కాదు.. రాజ్ పుత్ ల గౌర‌వానికి.. ప్ర‌తిష్ఠ‌కు భంగం వాటిల్లేలా ఉంటుంద‌న్న సందేహాలు వ్య‌క్తం చేశారు.

ప‌ద్మావ‌త్ చిత్రం విడుద‌ల‌వుతున్న వేళ‌.. వారు అనుమానిస్తున్న‌ట్లుగా ఎలాంటి అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు లేవ‌న్న విష‌యం రివ్యూలు చెప్పినా.. క‌ర్ణిసేన ఆందోళ‌న‌లు మాత్రం త‌గ్గ‌లేదు. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు.. ఆందోళ‌నలు నిర్వ‌హించారు. కొన్నిచోట్ల అవి శ్రుతిమించి హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు దారి తీసిన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. భోపాల్ లో క‌ర్ణిసేన నిర‌స‌న అతిగా మారింది. రోడ్ల మీద క‌నిపించిన వాహ‌నం మీద దాడి చేయ‌టం.. కొన్నింటిని త‌గ‌ల‌బెట్టేశారు. ఈ క్ర‌మంలో సొంత సంస్థ‌కు చెందిన కార్య‌క‌ర్త కారును కూడా త‌గ‌ల‌బెట్టేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. భోపాల్ లోని జ్యోతి టాకీస్ ద‌గ్గ‌ర మొద‌లైన ఆందోళ‌న‌.. అంత‌లోనే హింసాత్మ‌కంగా మారింది. క‌నిపించిన షాపుల్ని.. వాహ‌నాల్ని ప‌గ‌ల‌కొడుతూ దూసుకెళ్లారు.

ఆ క్ర‌మంలో వారి కంట ఎంపీ04 హెచ్ సీ 9653 స్విఫ్ట్ కారు క‌నిపించింది. ఆ వెంట‌నే దాన్ని త‌గ‌లబెట్టేశారు. త‌న కారును త‌గ‌ల‌బెట్టేస్తున్న ఆందోళ‌న‌కారుల తీరును త‌ప్పు ప‌డుతూ ఒక వ్య‌క్తి ప‌రుగు ప‌రుగున ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

ఇంత‌కీ ఆ బాధితుడు కూడా కర్ణిసేనకు చెందిన‌వాడే. అత‌ను కూడా మిగిలిన వారి మాదిరి ఆందోళ‌న నిర్వ‌హిస్తూ.. కారును వ‌దిలి ప‌క్క బ‌జారుకు వెళ్లారు.

ఈ విష‌యం తెలీని క‌ర్ణిసేన ఆందోళ‌కారులు త‌మ సంస్థ‌కు చెందిన మ‌రొక‌రి కారును త‌గ‌ల‌బెట్టేశారు. ఈ వ్య‌వ‌హారంలో మ‌రో కీల‌క‌మైన అంశం ఏమిటంటే.. తాము త‌గ‌ల‌బెట్టే కారుకు క‌ర్ణిసేన స్టిక్క‌ర్ అంటించి ఉన్నా.. దాన్ని ప‌ట్టించుకోకుండా త‌గ‌ల‌బెట్టేసిన వైనంపై బాధితుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టంతో.. కారు త‌గ‌ల‌బెట్టిన ఉదంతంలో సంబంధం ఉన్న ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News