సాహిత్యం - రాజకీయాలు రెండిట్లోనూ రికార్డుల యోధుడు

Update: 2018-08-07 15:38 GMT
తమిళ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అస్తమయం ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి భారీ శూన్యత ఏర్పరిచింది. ఈ తరానికి డీఎంకే అధినేతగా.. తమిళనాడు రాష్ట్రానికి అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగానే సుపరిచుతుడైన కరుణానిధి యావద్భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఎన్నో ప్రత్యేకతలున్న నేతగా మాత్రం చాలామందికి తెలియదు. ఆయన పోరాటాల వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ గొప్ప హక్కు దక్కిందన్న విషయం కొద్ది మందికే తెలుసు. అది... స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేసే హక్కు. అవును... రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆగస్టు 15న జెండా ఎగరవేసే హక్కు సాధించిపెట్టిన ఖ్యాతి కరుణానిధిదే.
  
అంతేనా... ఆయనకు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రచయితగా దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ చేయితిరిగిన కలం వీరుడు కళైంజర్.  కరుణానిధి 1947 నుంచి 2011 వరకూ 64 సంవత్సరాల పాటు సినిమాలకు సంభాషణలు - కథలు రాసిన వ్యక్తి ఆయన.  ఆయన జీవిత కాలంలో  రాసి ప్రచురించిన సాహిత్యం ఏకంగా 2 లక్షల పేజీలకంటే ఎక్కువ. ఆయన తన పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో ‘ఉదాన్‌పిరప్పి’ అనే సీరియల్ నిరాటంకంగా రాశారు. ఉదాన్ పిప్పి అంటే తెలుగులో సోదారా!అని అర్థం. ప్రపంచ వార్తాపత్రికల చరిత్రలోనే ఇదో రికార్డు. ఇంత సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సిరీస్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.
  
ఇక రాజకీయాల్లోకి వస్తే స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయ జీవితం మొదలై ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేత దేశంలో ఆయనొక్కరే. జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోని నేత ఆయన. అంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటమి ఎదురుకాని నేత ఇంకెవరూ లేరు.
  
ముత్తువేల్ కరుణానిధి 1924 జూన్ 3వ తేదీన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి పెరిగింది. జస్టిస్ పార్టీ నాయకుడు అళగిరిసామి ప్రసంగాలకు ఆకర్షితుడై రాజకీయాల వైపు మళ్లారు. ఆరు దశాబ్దాలకు పైగా శాసనసభ్యుడిగా ఉన్న రికార్డు ఆయన పేరిటే ఉంది.
Tags:    

Similar News