తమిళనాడుకు పెన్నిధి.. కరుణానిధి

Update: 2018-08-07 16:53 GMT
కళైంజర్... కరుణానిధిని తమిళులు ఆప్యాయంగా పిలుచుకునే పేరు. కళైంజర్ అంటే కళాకారుడని అర్థం. ఆయన మాట్లాడితే చివరి పలుకు వరకు చెవులు రిక్కించి వినాల్సిందే. ఆయన రాసిన పుస్తకం పట్టుకుంటే చివరి అక్షరం వరకు వదలకుండా చదవాల్సిందే. అంతటి పదునైనవి ఆయన గళం, కలం. పద్నాలుగేళ్లకే రాజకీయ ప్రవేశం చేసి పదిహేడేళ్లకే క్రియాశీల నేతగా ఎదిగిన చురుకుదనం ఆయనది.
   
స్కూళ్లో చదువుకునే రోజుల్లో ఆయనో పుస్తకం చదివారు. అందులో మద్రాస్ ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి - జస్టిస్ పార్టీ నేత రామరాయనింజర్ గురించి ఉంది. ఆయన జీవితం - ప్రస్థానం కరుణను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరణ కలిగించాయి. అది చదివిన వెంటనే ఆయన అప్పటికి ఉదృతంగా సాగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చారు. 17 ఏళ్ల వయసులో తమిళ్ స్టూడెంట్స్ ఫోరమ్ అనే విద్యార్థుల సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘంతో పాటే ఆయన రచనా వ్యాసంగం కూడా ఊపందుకుంది. సంఘం కోసం ఒక చేతిరాత మ్యాగజీన్ నడిపేవారు. దానికి సంపాదకుడు ఆయనే.

అన్నాదురై శిష్యరికం

తమిళనాడు రాజకీయాల్లో ఉద్ధండుడు అన్నాదురైను కరుణ 1940 ప్రాంతాల్లో తొలిసారి కలిశారు. పెరియార్’ ఇ.వి.రామసామికి చెందిన ద్రవిడ కళగం(డీకే) పార్టీ నుంచి అన్నాదురై  విడిపోయి ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) స్థాపించినప్పుడు కరుణానిధి ఆయనకు ముఖ్య అనుచరుడిగా మారారు. డీఎంకే స్థాపించినప్పుడు కరుణను ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించారు. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు.
   
రాజకీయంగా ఎదుగుతున్న కాలంలోనే ఆయన తమిళ సినిమా రంగంలోనూ అడుగుపెట్టారు. తమిళ సినిమా ‘రాజకుమారి’కి తొలిసారి మాటల రచయితగా పనిచేశారు. ఆయన రాసిన సంభాషణలు అప్పట్లో తమిళ సినీ అభిమానులను కట్టిపడేశాయి. సామాజిక మార్పును కోరుకుంటూ ఆయన రాసే మాటలు ప్రజలపై ప్రభావం చూపించేవి. భావంలో తీవ్రత - భాషలో సౌందర్యం రెండూ ఆయన సొంతం. అదే ఆయన్ను గొప్ప మాటల రచయితను చేశాయి. ఆయన సంభాషణలు రాస్తే ఆ సినిమా 100 రోజులు ఆడాల్సిందే అన్నట్లుగా మారింది. 1952లో విడుదలైన ‘పరాశక్తి’ సినిమాకు ఆయన రాసిన మాటలు తమిళ సినీ సాహిత్యంలో కలికితురాయిగా చెప్తారు. సామాజిక - ఆర్థిక అంతరాలు.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన రాసిన పదునైన సంభాషణలు ప్రభంజనమే సృష్టించాయి. సినిమాలకే కాదు టీవీ సీరియళ్లకూ ఆయన రాశారు. తాను జబ్బు పడేవరకు కూడా రాస్తూనే ఉన్నారు.
   
తన భావజాలాన్ని ప్రజలకు చేరవేయడానికి ఆయన ‘మురసోలి’ అనే  వార్తాపత్రికను స్థాపించారు. అనంతర కాలంలో ఆ పత్రికే డీఎంకే అధికారిక వార్తాపత్రికగా మారింది. 75 ఏళ్లుగా ఆ పత్రిక కొనసాగుతోంది.     1957లో కరుణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కులిత్తాలై నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తిరువారూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పటివరకు 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి కూడా ఓటమి అన్నది లేదు ఆయనకు. తమిళనాడులో అన్నాదురై సీఎంగా 1967లో తొలిసారి డీఎంకే ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో కరుణ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో ప్రయివేటు బస్సులను జాతీయం చేయడం ఆయన కాలంలోనే జరిగింది. తమిళనాడులోని మారుమూల పల్లెల్లకు కూడా బస్సు సదుపాయం కల్పించే బృహత్ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణ సీఎం అయ్యారు.

ఎన్నో సంస్కరణలు

సీఎం అయ్యాక కూడా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భూగరిష్ఠ పరిమితిని 15 ఎకరాలకు తగ్గించారు. బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 31 శాతానికి పెంచారు. అంతేకాదు... ఆలయాల్లో అర్చకులుగా అన్ని కులాల వారికీ అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు కొడుకులతో సమానంగా హక్కు కల్పిస్తూ చట్టం చేశారు.కరుణానిధి హయాంలో తమిళనాడులో తొలిసారి వ్యవసాయ పంపుసెట్లకు పూర్తి ఉచితంగా విద్యుత్ సరఫరా చేశారు. మోస్ట్ బాక్‌వర్డ్ క్యాస్ట్స్ అనే కొత్త వర్గాన్ని సృష్టించి వారికి విద్యాఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. చెన్నైలో మెట్రో రైలు - రూపాయికే కిలో బియ్యం - స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ - ఉచిత ప్రజా ఆరోగ్య బీమా పథకం - దళితులకు ఉచిత ఇళ్లు - చేతితో లాగే రిక్షాల నిషేధం వంటివన్నీ కరుణ సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే.

పార్టీ చీలిపోయినా..

డీఎంకే పార్టీకి కరుణానిధి 50 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్తారు. అయితే, ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే ఏర్పాటుచేసుకున్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచి ఎంజీరామచంద్రన్ సీఎం అయ్యారు. కానీ, తరువాత ఎన్నికల్లో మళ్లీ డీఎంకేను కరుణ అధికారంలోకి తీసుకొచ్చారు. అనంతరం 1993లో వైగో మరోసారి పార్టీని చీల్చి ఎండీఎంకే పార్టీని స్థాపించారు. ఈసారి కూడా పార్టీని మళ్లీ బతికించుకుని అధికారంలోకి రాగలిగారు కరుణ.

జాతీయ రాజకీయాల్లోకి..

తమిళనాడులో తిరుగులేని నేతగా కొనసాగిన కరుణ 1988లో వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంటులో చేరారు. 89లో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం డీఎంకే 2009లోను, 2014లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాల్లో ఉంది.  మన్మోహన్‌ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న మొదటి యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన 12 మంది కేంద్ర మంత్రులయ్యారు.

Tags:    

Similar News