డిఫాల్టర్ గా కార్వీ స్టాక్ బ్రోకింగ్.. నమ్మితే ఎంత పని చేసింది?

Update: 2020-11-25 07:15 GMT
నమ్మకద్రోహం అంటారు కానీ.. ప్రాక్టికల్ గా చూస్తే.. నమ్మిన వారిని మాత్రమే ద్రోహం చేయగలరు కానీ.. నమ్మనోళ్లను కాదు కదా? ఈ లాజిక్ ను మిస్ అయి పలువురు తప్పు మీద తప్పు చేసేస్తుంటారు. ఏళ్ల తరబడి స్టాక్ బ్రోకింగ్ చేస్తూ.. ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ చేసిన తప్పుడు పనితో దాన్ని.. డిఫాల్టర్ గా ప్రకటించింది ఎన్ఎస్ఈ. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వ్యవహరించిన తీరుతో దాని సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా తాజా సర్క్యులర్ లో పేర్కొంది.

నవంబరు 23 నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో కొత్త క్లయింట్లను తీసుకోకుండా కార్వీ బ్రోకింగ్ పై మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధాన్ని ఫైనల్ చేశారు. అంతేకాదు.. సంస్థ పైనా.. దాని డైరెక్టర్ల పైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇంతకూ కార్వీ చేసిన తప్పేమిటి? దాని తీవ్రత ఎంత అన్న వివరాల్లోకి వెళితే.. 1985లో రిజిస్ట్రీ సర్వీసుల సంస్థగా కార్వీ గ్రూపు తన కార్యకలాపాల్ని షురూ చేసింది.

తర్వాతి కాలంలో కమోడిటీలు.. బీమా.. రియాల్టీ.. ఆన్ లైన్ బ్రోకింగ్ తదితర విభాగాల్లోకి విస్తరించింది. ఈ క్రమంలో బ్రోకింగ్ సంస్థగా క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగానికి పాల్పడింది. ఖాతాదారులకు తెలీకుండా వారి ఖాతాల నుంచి రూ.2300 కోట్ల విలువైన సెక్యురిటీలను.. తన డిమ్యాట్ అకౌంట్లలోకి అక్రమంగా తరలించింది. అక్కడితో ఆగని ఆ సంస్థ.. ఆ షేర్లను వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంది. వాటిని కార్వీరియాల్టీ వంటి గ్రూపులకు మళ్లించింది.

దీని యవ్వారం మొత్తం 2019లో బయటకు వచ్చింది. ఈ ఉదంతం ఒక సంచలనంగా మారింది. నమ్మితే.. మరీ ఇంత దారుణంగా మోసపుచ్చటమా? అన్నది ప్రశ్నగా మారింది. 2019 నవంబరులో కార్వీ కొత్త క్లయింట్లు తీసుకోకుండా సెబీ బ్యాన్ చేసింది. డిసెంబరులో కార్వీ ట్రేడింగ్ కార్యకలాపాల్ని స్టాక్ ఎక్సైంజీలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. క్వారీ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత బ్రోకింగ్ సంస్థలకు సైతం కఠిన నిబందనల్ని అమల్లోకి తెచ్చింది. ఎంత పెద్ద మోసమో అర్థమవుతుంది కదా?
Tags:    

Similar News