కర్ణాటక సీఎంలను వెంటాడుతున్న సెంటిమెంట్‌

Update: 2019-09-06 05:44 GMT
కర్ణాటక రాష్ట్రంలో సెంటిమెంట్‌లు ఎక్కువ. దేవుడిని నమ్ముతారు. మఠాలను సందర్శిస్తారు. స్వామీజీల సూచన మేరకు రాజకీయ నాయకులు నడుచుకునే పద్ధతిని కర్ణాటకలో చూస్తున్నాం. దేవుడిపై భారం వేసి ముహూర్తం ప్రకారం నామినేషన్, ఓటు వేయడం, ప్రమాణస్వీకారం తదితర కార్యక్రమాలు చేస్తుండటం చూడవచ్చు. అయితే ఉత్తర కన్నడ జిల్లా కేంద్రం కారవారలో పర్యటిస్తే.. అనంతర కాలంలో సీఎం పదవి ఊడిపోయడం ఖాయమని గతంలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కారవార వెళ్లాల్సిన సీఎం యడియూరప్ప ఉన్నఫలంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రజల కన్నా పదవే ముఖ్యమని యడియూరప్ప అధికారం కోసం పాకులాడుతున్నట్లు స్పష్టం అవుతోందని కారవార కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే గతంలో కారవారలో పర్యటించిన ఏ ఒక్క సీఎం కూడా అనంతరం ఏడాది కాలం పాటు పదవిలో లేరు.
 
గత శనివారం (ఆగస్టు 31) సీఎం యడియూరప్ప కారవార వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలంగా లేదని కారవార పర్యటన రద్దు చేసుకున్నారు. భారీ వర్షాలు కురిసిన అన్ని ప్రాంత్లాలో సీఎం హోదాలో ఆయన సందర్శించారు. అయితే కారవారలో పర్యటిస్తే సీఎం పదవి పోతుందనే ఉద్దేశంతోనే రద్దు చేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే సీఎం వస్తారని జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కారవారతో పాటు శిరసి - సిద్ధాపుర - కుమటె - అంకోలా - భట్కళ ప్రాంతాల్లో పర్యటించాల్సిన యడియూరప్ప హెలికాప్టర్‌ వెళ్లేందుకు వాతావరణం సరిగా లేదని రద్దు చేసుకోవడంలో ప్రజలకు రుచించడం లేదు. ఆయన తన షెడ్యూల్‌ మార్చుకుని ప్రత్యేక హెలికాప్టర్‌ లో సొంత జిల్లా శివమొగ్గకు తరలివెళ్లారు.

గతంలో జరిగిన సంఘటనలు..

– 2005 నవంబరులో అప్పటి సీఎం ధరంసింగ్‌ కారవారలో పర్యటించారు. 2006 జనవరిలో జేడీఎస్‌ నుంచి మైత్రి చెడిపోవడంతో పదవి కోల్పోయారు.

– 2010 నవంబరు 19న అప్పటి సీఎం యడియూరప్ప కారవార వెళ్లారు. 2011 ఆగస్టులో ఆయన పలు కేసుల్లో భాగంగా జైలుకు వెళ్లడంతో పదవి కోల్పోయారు.

– 2012 ఫిబ్రవరిలో డీవీ సదానందగౌడ కారవార పర్యటన అనంతరం అదే ఏడాది జూలైలో సీఎం పదవి కోల్పోయారు. పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా సీఎం పదవి మరొకరికి ఇచ్చారు.

– 2013 జనవరిలో అప్పటి సీఎం జగదీశ్‌ శెట్టర్‌ కారవారలో పర్యటించారు. 2013 మే నెలలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో పదవి కోల్పోయారు.

– 2018 ఫిబ్రవరిలో సిద్ధరామయ్య కారవార వెళ్లారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో హంగ్‌ రావడంతో అధికారం కోల్పోయారు.

– 2019 ఏప్రిల్‌ 4వ తేదీన హెచ్‌డీ కుమారస్వామి కారవారలో పర్యటించారు. జూలై నెలలో అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో బలపరీక్షలో విఫలమై అధికారానికి దూరమయ్యారు.


Tags:    

Similar News