ప‌వ‌న్ అజ్ఞాతవాసి కాదు...అజ్ఞాన‌వాసి

Update: 2017-12-09 04:20 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై మ‌రోమారు సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ మ‌రోమారు ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లు - స్పంద‌న‌ల నేప‌థ్యంలో మ‌హేశ్ విరుచుకుప‌డ్డారు. జ‌న‌సేన‌లో జనం లేరని కేవ‌లం సైనికులు లేరని ఎద్దేవా చేశారు. కేవ‌లం సేనాధిప‌తి మాత్ర‌మే ఉన్నాడ‌ని మ‌హేశ్ మండిప‌డ్డారు. ఓ మీడియా చాన‌ల్‌ తో మాట్లాడుతూ ప‌వ‌న్ పై మ‌హేశ్ విరుచుకుప‌డ్డారు. జ‌న‌సేన పీఆర్పీ కంటే దారుణంగా త‌యారైందని మ‌హేశ్ మండిప‌డ్డారు. పీఆర్పీలో సామాజిక న్యాయం ఉండేద‌ని పూలే - అంబేద్క‌ర్ విధానాలు ఉండేవ‌ని జ‌న‌సేన పార్టీలో ప‌వ‌న్ త‌ప్ప మ‌రేం లేదని మ‌హేశ్ మండిప‌డ్డారు.

`అస‌లు జ‌న‌సేన పార్టీకి ఓ సిద్ధాంతం ఉందా? అంబేద్క‌ర్ పేరు జపిస్తున్న ప‌వ‌న్....రోహిత్ వేముల‌ - గ‌ర‌గ‌ప‌ర్రు - మంథ‌ని వంటి ద‌ళితుల ఆకృత్యాల ఘ‌ట‌న‌ల‌పై ఎందుకు స్పందించ‌లేదు? తుని ఘ‌ట‌న‌లో ప్ర‌త్యేక ఫ్లైట్‌ తో వ‌చ్చేసిన ప‌వ‌న్‌...ఇక్క‌డికి ఎందుకు రాలేదు? ప్ర‌జారాజ్యంలో సామాజిక న్యాయం పేరుతో ఇంద‌రికి సీట్లిచ్చాం అనే చెప్పుకునేందుకు వేదిక‌గా ఉండేది. పాజిటివ్ హోప్ అయినా ఉండేది. కానీ జ‌న‌సేన‌లో అదేం లేదు. ప‌వ‌న్‌ కార్పొరేట్‌ అనుకూల‌వాది. కాపుల‌కు మాత్ర‌మే లీడ‌ర్‌` అని విరుచుకుప‌డ్డారు. త‌న‌కు కులం - మ‌తం లేదంటున్న ప‌వ‌న్ ఏపీలో రాజకీయాలు అన్నీ కుల‌ప‌రంగానే ఉంటాయ‌నే విష‌యాన్ని ఎందుకు మ‌రుగున‌ప‌ర్చుతున్నాడ‌న్నారు. `కులాలకు అతీతంగా ప్ర‌జాసేవ చేయాలంటే ఎన్జీఓ పెట్టుకోండి - హిమాల‌యాల‌కు వెళ్లండి. కానీ రాజ‌కీయాలు ఎందుకు?రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా వ‌చ్చేది అధికారం కోసం త‌ద్వారా ఎక్కువ మందికి ఎలా ఉప‌యోగ‌ప‌డ్తాం అనే దాని కోసం. అంత‌గా ప్ర‌జాసేవ‌పై ఆస‌క్తి ఉంటే...సినిమాల్లో రెమ్యునరేష‌న్ తీసుకొని ప్ర‌జ‌లకు సేవ చేయ‌వ‌చ్చు క‌దా?` అని మ‌హేశ్ వివ‌రించారు.

పాల‌క‌ప‌క్షంను ప్ర‌శ్నిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు, ప్ర‌జ‌ల పక్షాన నిలిచేందుకు పార్టీ ఉంటుంద‌ని ఈ రెండు చేయ‌నిది జ‌న‌సేన‌ ఎందుకని మ‌హేశ్ ప్ర‌శ్నించాడు. `ప‌వ‌న్ ఎందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడో,..ఎందుకు పోరాడుతున్నాడో క్లారిటీ లేదు. ఒక్క లీడ‌ర్ త‌ప్ప మ‌రేంలేదు. జ‌న‌సేన పార్టీ కాదు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ. చిరును మోసం చేసిన వారిని వ‌ద‌ల‌న‌ని ప్ర‌క‌టించిన చెప్పుతో క‌క్ష సాధింపున‌కు పునాదేనా? అన్న అంద‌రినీ మోసం చేశాడ‌ని అంటున్న ప‌వ‌న్ అదే అన్న‌...ప్ర‌జ‌ల‌ను - మోసం చేశాడు - నేత‌ల్ని మోసం చేశాడు.గిరిజ‌న‌ - ఎస్సీ - ఎస్టీ - మైనార్టీల‌ను మోసం చేశాడు. అన్న‌కు జ‌రిగిన అన్యాయం గుర్తుంటుంది కానీ జ‌నాల‌కు జ‌రిగిన అన్యాయం గుర్తుండ‌దా? ఇంద‌రినీ మోసం చేసిన అన్నను నువ్వు ఎందుకు ప్ర‌శ్నించారు? అన్న పార్టీ ఫెయిల‌యిన క‌క్ష సాధింపు కోసం వ‌చ్చాడా? క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు - ప‌గ‌ల‌కు వేదింపా?ఈయ‌న జ‌న‌సైనికుడా?జ‌న‌సేనానా?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు.

ఏం మాట్లాడినా...గ‌న్ ప‌ట్టుకొని వ‌చ్చేయ‌డం ప‌వ‌న్‌ కు అలవాటని మ‌హేశ్ ఎద్దేవా చేశారు. `ప‌వ‌న్‌ ను ఏం ప్ర‌శ్నించినా స‌మాధానం రాదు. ఎందుకంటే ఆయ‌న‌కు స‌మాధానం తెలియ‌దు. ఎలా చెప్పాలో తెలియ‌దు.ఆయ‌న‌కు స్పీచ్‌ లు ఇవ్వ‌డం.. ఊగిపోవ‌డం తప్ప విశ్లేష‌ణాత్మ‌కంగా మాట్లాడింది ఇప్ప‌టివ‌ర‌కు ఎన్న‌డూ లేదు. కుల‌మ‌తాల ప‌ట్టింపు లేదంటాడు...కానీ కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తిస్తాడు. ఎంత అజ్ఞాతంలో ఉన్నాడో అర్థం అవుతోంది. ఆయ‌న అజ్ఞాత వాసి కాదు....అజ్ఞాన‌వాసి. సినిమాల్లో విశ్రాంతి కోసం స‌భ‌లు పెట్ట‌డం ప్ర‌జ‌ల‌తో అనుసంధానం కావ‌డం. ఏం మాట్లాడితే ఎలాంటి లాభం ఉంటుంద‌నే దానికోసం స‌భ‌లు పెట్ట‌డం` అంటూ విరుచుకుప‌డ్డారు.

మూడేళ్లుగా జ‌న‌సేన ఉన్న‌ప్ప‌టికీ....ఇప్పుడే స్పందించ‌డం వెనుక అర్థం ఏమిట‌ని మ‌హేశ్ ప్ర‌శ్నించాడు. ` సీఎం చంద్ర‌బాబుకు అవ‌స‌రం ప‌డిన‌ప్పుడే..ఆ ప‌రిస్థితిని స‌రిదిద్దేందుకు ప‌వ‌న్ వ‌స్తుంటాడు. కొద్దికాలం క్రితం త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌న్నాడు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు పెడుతున్నారు? అంత డ‌బ్బులు ఎక్క‌డివి?` అని ప్ర‌శ్నించారు. `ఏపీలో కులం నిజం లేద‌నేది అబ‌ద్దం. మ‌న స‌మాజం ఆర్థిక‌ - సామాజిక రాజ‌కీయ విధానాల‌పైనే ఉంది. కుల స‌మీక‌ర‌ణ‌లు లేని భార‌తదేశాన్ని ఎవ‌రూ ఊహించ‌లేరు. ప‌వ‌న్‌ ను చూసి కూడా మా కాపు నాయ‌కుడు వ‌స్తున్నారని అందుకే కాపులు అంటున్నారు` అంటూ మహేశ్ అన్నారు.

`ఏపీలో రెడ్లు - క‌మ్మ‌ల‌ - త‌ర్వాత కాపులే ఎక్కువ‌గా. ప్ర‌జారాజ్యం సంద‌ర్భంగా అంద‌ర్నీ క‌లుపుకున్నారు. అందుకే వారిని ఆద‌రించారు. కానీ ప‌వ‌న్ ఒక్క‌సీటు గెల‌వ‌డం క‌ష్ట‌మే. పార్టీ నేత‌లుగా చెప్పుకునే వారంతా ఫ్యాన్స్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ కాదు. ఆయ‌న అభిమానుల‌కు ఏం క్లారిటీ లేదు. నోరు తెరిస్తే బెదిరించ‌డం. ఇలాంటి వారు రాజ‌కీయాల్లోకి వ‌స్తే గుండాలు - రౌడీలుగా మార‌డం త‌ప్ప మ‌రేం లేదు. ఈ మాత్రం దానికి మా దేవుడిని ప్ర‌శ్నిస్తారా? అంటుంటారు? మ‌రి భ‌విష్య‌త్‌ లో ఎన్నో ప్ర‌శ్నిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇత‌ను ఏం చేస్తున్నారో తెలియ‌ని స్థితిలో ఇటు పార్టీలో అటు అభిమానుల్లో ఉన్నారు` అని అన్నారు.
Tags:    

Similar News