బాబు గురించి క‌విత‌క్క ఏమ‌న్నారంటే...

Update: 2016-06-28 12:35 GMT
న్యాయ‌మూర్తుల ఆందోళ‌న విష‌యంలో టీఆర్‌ ఎస్ ఎంపీ కవిత త‌న‌దైన శైలిలో స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు విభజనను అడ్డుకొని తెలంగాణలో రాజకీయం చేయాలనుకోవడం బాబుకు సరికాదని సూచించారు. గచ్చిబౌలిలో హైకోర్టుకు భవనం లేదా స్థ‌లం కేటాయిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు స్పందించడం లేదని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ న్యాయశాఖనంతా ఆంధ్రా జడ్జీలతో నింపేస్తున్నారు. ఆంధ్రాలో పని చేస్తున్న జడ్జీలు కుట్రపూరితంగా తెలంగాణ ఆప్షన్లు ఇస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్రా జడ్జీలే కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. రెండు సంవత్సరాలుగా జడ్జీల నియామకంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. హైకోర్టులో ముగ్గురే తెలంగాణ జడ్జీలు ఉన్నారు. తెలంగాణకు న్యాయవ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని హైకోర్టుకు వెళ్తే తీర్పులు ఆక్రమణదారులకు అనుకూలంగా వస్తుండ‌టాన్ని గ‌మ‌నించాలి. మల్లన్నసాగర్ వద్ద ప్రజలను మభ్య పెట్టడం కాదు. టీడీపీ నేతలకు దమ్ముంటే హైకోర్టు కోసం హైకోర్టు ఎదుట దీక్ష చేయాలి. జడ్జీల విభజనపై జానారెడ్డి ఎందుకు స్పందించడం లేదు. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ మేధావులు స్పందించాలి. జడ్జీల విభజనలో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలి. తెలంగాణ జడ్జీలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌ లో టీఆర్‌ ఎస్ ఎంపీలమంతా గళమెత్తుతాం. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రంలో చలనం తీసుకొస్తాం. తెలంగాణ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని’ కవిత స్పష్టం చేశారు.

హైకోర్టు విభజనపై సీఎం కేసీఆర్ చాలాసార్లు ప్రధాని మోడీ - హోంమంత్రి రాజ్‌ నాథ్‌ కు విజ్ఞప్తి చేశార‌ని క‌విత చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పంద‌న రాలేద‌ని ఎందుకింత నిర్లక్ష్యమ‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు కోసం ఉద్యమించాలని కోరారు. కేంద్రం వద్ద కొట్లాడి హైకోర్టు విభజనకు సానుకూల నిర్ణయం తీసుకురావాలని క‌విత‌ డిమాండ్ చేశారు.
Tags:    

Similar News