బాబు, కేసీఆర్‌ పై క‌విత కామెంట్లు ఇవే

Update: 2017-04-11 13:27 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పేరును కేవ‌లం విమ‌ర్శ‌ల కోణంలోనే ప్ర‌స్తావించే క‌విత తాజాగా అనూహ్య‌మైన‌ ప్ర‌శంస‌లో బాబుకు చోటు క‌ల్పించారు. అయితే బాబుతో పాటు త‌న తండ్రి కేసీఆర్‌ ను సైతం పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఇదంతా బీజేపీ మాజీ ఎంపీ త‌రుణ్ విజ‌య్  చేసిన ఉత్త‌రాది,ద‌క్షిణాది వ్యాఖ్య‌లను ఎండ‌గ‌ట్టే క్ర‌మంలో చేసిన కామెంట్లు.

బీజేపీ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు త‌న‌ను ఎంతో బాధించాయ‌ని క‌విత తెలిపారు. అయితే త‌రుణ్ విజ‌య్ త‌న వ్యాఖ్య‌ల‌పై ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో స‌ద‌రు కామెంట్లపై చ‌ర్చ అవ‌స‌రం లేద‌న్నారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం తెలుగు రాష్ర్టాల వైపు దృష్టి సారించేందుకు కార‌ణం త‌న తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్‌, పొరుగు రాష్ట్రమైన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మేన‌ని క‌విత చెప్పారు. తెలుగు వారిపై, ద్ర‌విడుల‌పై కేంద్రం త‌న దృక్ప‌థాన్ని మార్చుకోవ‌డానికి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌, త‌మిళ‌నాడులో నేత‌ల నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రెండు పార్టీలే అధికారంలోకి వ‌స్తాయ‌నే భావ‌న మారాల‌ని క‌విత అన్నారు.ప్రాంతీయ పార్టీలు బ‌లోపేతం కావాల‌ని క‌విత ఆకాంక్షించారు.

కాగా, కొద్దికాలం క్రిత‌మే ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని ఎంపీ క‌విత డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చంద్ర‌బాబునాయుడును సైతం తెలుగువారికి గుర్తింపు తెచ్చిన నాయ‌కుడిగా ప్ర‌స్తావించ‌డం అంటే...ఆంధ్రుల హృద‌యాల్లో సానుకూల దృక్ప‌థాన్ని పెంచుకునే ప్ర‌య‌త్న‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News